చేవెళ్ల టౌన్, నవంబర్ 19: చేవెళ్ల మండల కేంద్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి జనరల్ దవాఖానలో ఆరోగ్యశ్రీ సెంటర్‌ను ప్రా రంభించి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఆసరా గా నిలుస్తున్నదన్నారు. తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని చూసే కేంద్ర ప్రభు త్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడా రు. త్వరలోనే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథ కం ప్రారంభం కానున్నదన్నారు. వికారాబాద్ జిల్లాకు త్వరలోనే మెడికల్ కళాశాల రానున్నదని, దీంతో ఇక్కడ మెడిసిన్ చదివే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతకు మెకానికల్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ వైరింగ్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్ తదితర కోర్సుల్లో వసతితో కూడిన ఉచిత శిక్షణ ఇప్పిస్తామని ఆయన తెలిపారు.
సొంత డబ్బుతో అంబులెన్స్ సేవలు
అనంతరం ఎంపీ రంజిత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్వరలో చేవెళ్ల, వికారాబాద్ ప్రాంతాల్లో సొంత డబ్బుతో ఉచిత అంబులెన్స్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ అంబులెన్స్‌ల సేవలు ప్రజలకు సకాలంలో అందేలా ఒక హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసుకోవాలని పట్నం మహేందర్ జనరల్ దవాఖాన నిర్వాహకులకు సూచించారు. పేదలకు మెరుగైన వైద్యమందించడమే తన ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో పట్నం మహేందర్ జనరల్ దవాఖాన సీఈవో సత్యనారాయణ, సెక్రటరీ సంతోశ్‌రెడ్డి, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.