పరిగి, నవంబర్ 14 : దివ్యాంగులకు సర్కారు అండగా నిలుస్తున్నది. ఓవైపు దివ్యాంగులకు అందజేసే పింఛన్‌ను రూ.3,016 ఇవ్వడం ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తుండగా మరోవైపు చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు వారి అవసరాల మేరకు వాహనాలు, ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నది. వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగులైన విద్యార్థులకు మంజూరైన స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర వస్తువులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే వాటన్నింటినీ వికారాబాద్‌కు తరలించారు. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా వాహనాలు, ఇతర పరికరాలు జిల్లాకు వచ్చాయి. వాటిని త్వరలోనే పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
విద్యార్థులకు చేదోడుగా..
చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు చేదోడుగా నిలిచేందుకు సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఏమి అవసరమో గుర్తించి పంపిణీ చేస్తున్నది. ప్రధానంగా డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు వాహన సదుపాయం కల్పించాలని నిర్ణయించిన సర్కారు అందుకనుగుణంగా రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా వాహనాలు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నది. వికారాబాద్ జిల్లాకు 23 త్రిచక్ర వాహనాలు మంజూరవగా అర్హులైన 21 మందికి అందజేసేందుకు ఎంపిక చేశారు. అలాగే 6 ల్యాప్‌టాప్‌లను అంధులైన విద్యార్థులకు అందజేస్తారు. ఇందుకుగాను ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో ఉండే కీ బోర్డులు సైతం ఇస్తారు. వీటితోపాటు రెండు స్మార్ట్ఫోన్లు, హియర్ ఎయిడ్ పరికరాలను సైతం పంపిణీ చేస్తారు. వీటితోపాటు ఇతరులకు ఏదైనా ప్రమాదంలో పూర్తిగా నరాలు దెబ్బతిని నడవడానికి ఇబ్బంది ఉన్నవారికి అందజేసేందుకు 4 బ్యాటరీ వీల్ చైర్లు కూడా వచ్చాయి.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా వాహనాలు, ఇతర పరికరాలు ఉచితంగా అందజేసేందుకు అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు. టీఎస్‌ఓబీఎంఎంఎస్‌లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిని ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించి జిల్లాస్థాయిలో జిల్లా అదనపు కలెక్టర్, ఆర్టీఏ, జిల్లా వైద్యాధికారి, జిల్లా సంక్షేమాధికారి, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ఒకరు సభ్యులుగా ఉన్నారు. రోస్టర్ పాయింట్ల పద్ధతిలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వాటిని లబ్ధిదారులకు అందజేయనున్నారు.