
రంగారెడ్డి, ఆగస్టు 24, (నమస్తే తెలంగాణ) : మరో వారం రోజుల్లో బడి గంట మోగనుంది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యాసంస్థలకు సంబంధించి ప్రత్యక్ష తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ ప్రభావంతో ఆన్లైన్ తరగతులనే నిర్వహిస్తూ వస్తున్న ప్రభుత్వం 16 నెలల తర్వాత ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు నిర్ణయించింది. అయితే ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పట్టడం, ఇతర రాష్ర్టాల్లో విద్యాసంస్థలు ప్రారంభంకావడంతోపాటు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రులే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలతో సహా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటిలో వచ్చే నెల ఒకటో తేది నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వ వసతిగృహాల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
అంతేకాకుండా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. కొవిడ్ దృష్ట్యా ప్రభుత్వ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి మూడు మాస్కుల చొప్పున అందజేయనున్నారు. మరోవైపు ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు ఫీజుల విషయంలో ఇబ్బందులు పెట్టొద్దని, కేవలం ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పారిశుధ్య పనుల నిర్వహణ
తరగతి గదిలో భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయడంతోపాటు ప్రతి విద్యార్థి మాస్కులు ధరించడం, శానిటైజ్ వాడేలా అవగాహన కల్పించనున్నారు. ఏదేని విద్యార్థి అస్వస్థతకు గురైనట్లయితే వెంటనే చికిత్స అందించడంతోపాటు కొవిడ్ పరీక్ష నిర్వహించాలని, కొవిడ్ పాజిటివ్ అని తేలితే మిగతా విద్యార్థులకు కూడా పరీక్షలు చేసి ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రతి పాఠశాలలో సిక్ రూం ఒకటి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏ విద్యార్థికైనా జ్వర లక్షణాలు కనిపించినట్లయితే సిక్ రూంలో ఉంచి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని విద్యా సంస్థలు, వసతిగృహాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టనున్నారు. శానిటైజ్ చేయనున్నారు.
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1351 ఉండగా 1,22, 615 మంది విద్యార్థులున్నారు. ఆన్లైన్ తరగతులతో 50 శాతం మాత్రమే హాజరవుతున్న ఉపాధ్యాయులు వచ్చే నెల ఒకటి నుంచి అందరూ హాజరుకానున్నారు.
వికారాబాద్ జిల్లాలో 1,72,308 మంది విద్యార్థులు
కొవిడ్ నియంత్రణలోకి రావడంతో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పాఠశాలలు తెరువాలని సర్కారు నిర్ణయించింది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 1036 ప్రభుత్వ, 178 ప్రైవేటు పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 83,000 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 24,000 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి మొత్తం 1,07,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లా పరిధిలో 1106 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిలో 56308 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు 70 ఉండగా వాటిలో 9000 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి తగ్గడంతో ప్రత్యక్ష తరగతులు నిర్వహించవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
విద్యాసంస్థల్లో పక్కాగా శానిటైజేషన్
విద్యాసంస్థల్లో శానిటైజేషన్ పక్కాగా చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది. వికారాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ఆయా గ్రామపంచాయతీల ద్వారా రంగులు వేయించాలని మంగళవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 26 నుంచి అన్ని పాఠశాలల్లో 100 శాతం ఉపాధ్యాయులు విధులకు హాజరుకావాలని ఆదేశించారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డి.అమయ్‌కుమార్
సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించనున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్రతి తరగతి గదిలో శానిటైజర్, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఫర్నిచర్, నీటి సంపులు, ట్యాంకులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కడైనా విద్యుత్తు సౌకర్యం లేనట్లయితే పునరుద్ధరించాలి. విద్యార్థులు మాస్కులు ధరించేలా చూడాలి. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఈ నిబంధనలు పాటించేలా చూడాలని అదనపు కలెక్టర్ తిరుపతిరావు, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమాధికారి విద్యలకు సూచించారు.