Municipal Elections | పురపోరు నల్లేరుపై నడకే అని భావించిన కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 90 స్థానాలను గెలుచుకుంటామని బీరాలు పలికిన ముఖ్యమంత్రి.. కాలికి బలపం కట్టుకుని తిరిగినా కాంగ్రెస్ సగం స్థానాలనైనా దాటలేకపోయింది. ‘పది శాతం మున్సిపాలిటీలనైనా బీఆర్ఎస్ గెలుచుకుంటే, దేనికైనా రెడీ’ అన్న కోమటిరెడ్డి లాంటివారికీ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు పట్టణ ఓటర్లు. పాలన గాలికొదిలి, పంచాయితీల్లో మునిగి తేలుతున్న ప్రభుత్వ పెద్దలను కోలుకోలేని దెబ్బకొట్టారు.
అధికారపార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత మున్సిపోల్స్‌లో సుస్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పోటీ చేసిన 7 కార్పొరేషన్లలో 3 మాత్రమే దక్కించుకోగలిగింది. 116 మున్సిపాలిటీల్లో సగం కూడా అధికారపార్టీ దక్కించుకోలేకపోయింది. 13 చోట్ల జయకేతనం ఎగరేసిన బీఆర్ఎస్.. మరో 14 పట్టణాల్లో ఆధిక్యతను ప్రదర్శించింది. దాంతోపాటు చాలాచోట్ల కాంగ్రెస్‌కు ముకుతాడు వేసింది. ఫలితంగా 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. పట్టణాల్లో బలం ఉందనుకుని ఇన్నాళ్లూ భ్రమసిన బీజేపీది వాపేనని మరోమారు తేలిపోయింది. 8 మంది ఎంపీలు, 8మంది ఎమ్మెల్యేలున్న పార్టీ కనీసం ఒక్క మున్సిపాలిటీనీ పూర్తిస్థాయిలో గెలువలేక చేతులెత్తేసింది.
ఎన్నెన్ని ప్రలోభాలు! ఎంత అధికార దుర్వినియోగం!! ఎంతటి దౌర్జన్యకాండ!!! బెదిరింపులు, విత్‌డ్రాలు.. కుట్రలు, కిడ్నాప్‌లు.. దాడులు, దాష్టీకాలు.. రెండేండ్లుగా సాగుతున్న తప్పుడు కేసును మళ్లీ తెరపైకి తెచ్చింది కాంగ్రెస్! నోటీసులు, విచారణ పేర కేసీఆర్, కేటీఆర్, హరీశ్, సంతోష్‌లపై డ్రామా నడిపింది. బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆత్మరక్షణలోకి, కార్యకర్తల్ని సందిగ్ధంలోకి నెట్టానని భావించింది. భ్రమపడింది. కానీ కాంగ్రెస్ కంత్రీతనం తెలిసిన తెలంగాణ ప్రజలు.. కర్రుకాల్చి వాత పెట్టారు. డబ్బులు వెదజల్లినా.. డబ్బాలు బద్దలయ్యేలా తీర్పునిచ్చారు!
విపక్షానికి సరిపడా సమయం ఇవ్వకుండా ఆగమేఘాలపై ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ప్రభుత్వం.. అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ కనుసన్నల్లో ఎన్నికలను జరిపించింది. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అందుకు అధికారగణం మడుగులొత్తింది. ముఖ్యమంత్రి కాలికి హెలికాప్టర్ కట్టుకుని పట్టణాల్లో తిరిగారు. మంత్రులు మకాం వేసి, అన్ని సర్వశక్తులు ధారపోశారు. అంతా చేస్తే సర్కారుకు దక్కింది సగం మార్కులే!
కాంగ్రెస్ దౌర్జన్యాలను అన్నింటినీ తట్టుకుని నిలిచి, గెలిచింది గులాబీ జెండా. అధికార ఆరాచకంపై ఎదురొడ్డి పోరాడింది బీఆర్ఎస్ సేన. మొన్న పంచాయతీ ఎన్నికలు.. ఇప్పుడు మున్సిపాలిటీలు! పల్లె అయినా, పట్నం అయినా.. గులాబీ పార్టీ పునాదులు చెక్కుచెదరలేదని, ప్రజాదరణ ఇసుమంతైనా తగ్గలేదని మరోసారి తేటతెల్లమైంది. ఏనాటికైనా కాంగ్రెస్‌ను నిలువరించేది, ప్రజల పక్షాన పోరాడేది ముమ్మాటికీ బీఆర్ఎస్సేనన్న జనమనోగతం మరోసారి విస్పష్టంగా వెల్లడైంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్‌కు శృంగభంగమే ఎదురైంది. పట్నం తీర్పు రేవంత్ సర్కార్ పజీత తీసింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ అని విర్రవీగిన రేవంత్‌కు పట్టణ ఓటర్లు కర్రుకాల్చి వాతపెట్టారు. తనకు ఎదురేలేదని ప్రగల్భాలు పలికిన రేవంత్ సర్కార్‌ను బీఆర్ఎస్ శ్రేణులు వీరోచితంగా పోరాడి కట్టడి చేశాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ సగం కూడా గెలవలేదు. ఆ గెలిచిన మున్సిపాలిటీల్లోనూ ఆ పార్టీకి ఒకటీ అరా వార్డులే ఆధిక్యంగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ భారీగా పడిపోయిందని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకొని తిరిగినా అంతంతే ఫలితాలు వచ్చాయి.

పోలీసులను ఉసిగొల్పి, గూండాగిరీ ప్రదర్శించినా అనేకచోట్ల అధికార పార్టీని పుర ప్రజలు బండకేసి కొట్టారు. ఆరు గ్యారెంటీలు, అందులో భాగమైన 420 హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలుచేయని తీరుపై ప్రజలు ధర్మాగ్రహాన్ని ప్రదర్శించారు. ఓటుతో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు. కేవలం 66 మున్సిపాలిటీలకే పరిమితం చేశారు. తెలంగాణలోనే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ 70-80 శాతం స్థానాలను సొంతం చేసుకుంటుంది. ఇది ఆనవాయితీ. కానీ, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.
కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో 52 శాతం వరకే వచ్చాయి. ఇంత తక్కువకు పరిమితం కావడం బహుశా దేశంలో ఇదే తొలిసారి కావచ్చు. ఇక 13 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసింది. 36 మున్సిపాలిటీల్లో ఎటూ తేలని తీర్పు వచ్చింది. వీటిల్లో కనీసం 15 నుంచి 20 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ సొంతం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక వార్డుల వారీగా చూసినా కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. రాత్రి పొద్దుపోయేసరికి వెలువడిన మున్సిపల్ వార్డుల ఫలితాలను బేరీజు వేస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 1346 (52.15శాతం) మాత్రమే. అదే బీఆర్ఎస్ 718 వార్డులను దక్కించుకున్నది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలో తెలంగాణ పట్టణ ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. 2018లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి 2020 మున్సిపాలిటీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు, 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించిన ఈ ఫలితాలకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నదని స్పష్టమైంది.

Brs 01
2020లో 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 112 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ సొంతం చేసుకున్నది. అంటే మొత్తం ఫలితాల్లో 93.33 శాతం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేండ్లకు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే అందులో కేవలం 66 మున్సిపాలిటీల్లోనే కాంగ్రెస్ గెలువగలిగింది. అంటే కాంగ్రెస్ సాధించిన ఫలితం కేవలం 52.15 శాతమే. ఉజ్జాయింపుగా చూస్తే ఫలితాల్లో 41.18 శాతం తేడా స్పష్టంగా కనిపిస్తున్నది.
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని మున్సిపల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో తీర్పు చెప్పారు. అధికారంలో ఉన్న అనుకూలతలతో కన్నులొట్టబోయి గెలిచినట్టు ఎకువ స్థానాలు గెలిచింది.కాంగ్రెస్ ప్రభుత్వంపై స్పష్టమైన ప్రజావ్యతిరేకత ఉన్నదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పరువు నిలుపుకొనే, చెప్పుకొనే స్థాయిలో కూడా మున్సిపాలిటీలను గెలవలేకపోయింది. గెలిచామని సంబురం చేసుకోవాలో.. ఓడిపోయి సర్దుకుపోయామనే తృప్తి పడాలో తెలియని అయోమయస్థితిలో కాంగ్రెస్ పడిపోయింది. ఏకబిగిన 90 మున్సిపాలిటీలను సొంతం చేసుకుంటామని భీకర ప్రతిజ్ఞ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ముందు 36 మున్సిపాలిటీల్లో ఎటూ తేల్చని ఫలితం వెక్కిరిస్తున్నది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షపాత్ర పోషించలేదని 2020 మున్సిపల్ ఫలితాలు స్పష్టం చేశాయి. కానీ, ఇవ్వాళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ బాధ్యతాయుత ప్రతిపక్షంగా తన గురుతరబాధ్యతను పోషిస్తున్నదని ఈ మున్సిపల్ ఫలితాలు తేల్చిచెప్తున్నాయి. 2020లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 4 మున్సిపాలిటీలనే గెలుచుకోగలిగింది. అదే ఇవ్వాళ బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీల్లో విజయం సాధించడమే కాకుండా హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో 15 నుంచి 20 మున్సిపాలిటీలను సొంతం చేసుకోడానికి అవకాశాలున్నాయి. ఈ లెక్కన ప్రతిపక్షంగా నాడు కాంగ్రెస్ సాధించిన ఫలితాల కన్నా నేడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నది.

ఈ మున్సిపల్ ఫలితాలు తెలంగాణలో బీజేపీ పప్పులుడకవు అని తేల్చిపారేశాయి. ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీల్లో ఏ ఒక్కదాన్నీ ఆ పార్టీ సొంతం చేసుకోలేకపోయింది. వార్డుల విషయంలోనూ బీజేపీది అదే వరుస అని తేలిపోయింది. రాష్ట్రంలో 2581 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరిగితే వాటిలో బీజేపీ గెలిచింది కేవలం 259 మాత్రమే. అంటే కేవలం 10.03 శాతం వార్డులకే బీజేపీ పరిమితమైంది.
ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ నా అంచనాలు తప్పలేదు. ఇప్పుడూ తప్పవు. కాంగ్రెస్ ప్రజాపాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నరు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో 90 మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోబోతున్నది.
-ఈ నెల 9న కాంగ్రెస్ ముఖ్యనేతలతో అంతర్గత భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
