హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తలసాని ఈ విషయాన్ని ప్రకటించారు.
కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ సీనియర్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి, కేసీఆర్‌పై రూపొందించిన ప్రత్యేక పాట విడుదల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌కు తరలిరావాలని మాజీ మంత్రి తలసాని పిలుపునిచ్చారు.