
కొందుర్గు, ఆగస్టు 24 : ఒక పక్క ప్రభుత్వ సహకారం.. మరో పక్క వరుణ దేవుడి చల్లని చూపుల వల్ల వ్యవసాయ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలాల్లోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మండలాల్లో వర్షాకాలం ప్రారంభం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో రైతులు ఆరుతడి పంటలు వేసుకున్నారు. ప్రస్తుతం వరి నాట్లు వేసే పనుల్లో బిజీగా ఉన్నారు. వర్షాలకు వచ్చిన నీటితో పాటు తమ వద్ద ఉన్న బోరుబావుల్లో ఉన్న నీటితో వ్యవసాయం చేస్తున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న పంట సాగు
కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలాల్లో ప్రతి సంవత్సరం పంట సాగు పెరుగుతున్నదని వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ సంవత్సరం కొందుర్గు మండలంలో మక్కజొన్న 7500 ఎకరాలు, పత్తి 5300, వరి 2000, కందులు 1500 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు ఏఓ మధుసూదన్ తెలిపారు. జిల్లెడుచౌదరిగూడ మండలంలో మక్కజొన్న 7200 ఎకరాలు, పత్తి 6000, వరి 2200, కందులు 1700 ఎకరాల్లో సాగు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం పంటసాగు విస్తీర్ణం పెరుగుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న సహకారం వల్లనే పంట సాగు విస్తీర్ణం పెరుగుతున్నదని మండలవాసులు అంటున్నారు.
ప్రభుత్వ సహకారంతో..
తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికి ప్రభుత్వం అనేక నూతన పథకాలు అమలు చేసి పూర్తి సహకారం అందిస్తున్నది. ఇందులో భాగంగానే రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రుణమాఫీ వంటి పథకాలు అమలు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. దీంతో వ్యవసాయానికి అప్పులు తీసుకురావడం చాలా వరకు తగ్గింది. రైతులు పంటసాగుపై దృష్టిపెట్టి ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు.