వికారాబాద్, నవంబర్ 24 : రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్‌ల ఇండ్లను జనవరి 15, 2023 నాటికి లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పురోగతి, పోడు భూములు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా ఉచితంగా పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రాజెక్టును రూపొందించారని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు వారి పరిధిలో నిర్మాణం పూర్తైన, తుది దశలో ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, తుది దశలో ఉన్న ఇండ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై జిల్లాకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. జిల్లాలో పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని తేదీ నిర్ణయించుకొని పంపిణీకి సిద్ధం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా వికారాబాద్ కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో 3,800 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని, 1,026 ఇండ్ల పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయన్నారు. మరో 1,251 ఇండ్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. జీవో 58, 59 కింద 869 దరఖాస్తులు రాగా, స్క్రూట్నీ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న ధరణి కేసుల పరిష్కారం వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్, ఆర్డీవో విజయకుమారి, డీఆర్డీవో కృష్ణన్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
6,677 ‘డబుల్’ ఇండ్ల నిర్మాణం లక్ష్యం
రంగారెడ్డి జిల్లాలో 6,677 రెండు పడకల ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ అమయ్‌కుమార్ తెలిపారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్లకు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి సునీల్శర్మలు, జిల్లా కలెక్టర్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 4.225, పట్టణ ప్రాంతంలో 2,452. మొత్తం కలిపి 6,677 ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా, 2,741 ఇండ్లకు టెండర్ ఇప్పటికే పూర్తయ్యిందన్నారు. వాటిలో 2,341 ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని, మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాల్లో భాగంగా జిల్లాలో 867 లక్ష్యంగా పెట్టుకోగా, 326 క్రీడా ప్రాంగణాలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. బృహత్ ప్రకృతి వనాలు 105 లక్ష్యంగా పెట్టుకోగా 44 పూర్తి అయ్యాయన్నారు. పోడు భూములకు సంబంధించి జిల్లాలోని 6 గ్రామ పంచాయతీల నుంచి 1,086 దరఖాస్తులు వచ్చాయని, వాటి సర్వే ఇప్పటికే పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తిరుపతిరావు, రెవెన్యూ అధికారి హరిప్రియ, ఈఈపీఆర్ సురేశ్, ఆర్ అండ్ బీ ఈఈ శ్రవణ ప్రకాశ్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరీదేవి, పీడీ డీఆర్డీఏ ప్రభాకర్, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు వెంకటాచారి, చంద్రకళ, రాజేశ్వరి, వేణుగోపాల్, సూరజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.