పరిగి, జూలై 16 : తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు వర్షాకాలం వచ్చిందంటే కాజ్‌వేల వద్ద ప్రవహించే నీటి ఉధృతికి రాకపోకలు నిలిచిపోయేవి. చిన్నపాటి వర్షం వచ్చినా ఇబ్బందులు తప్పేవికావు. తప్పనిసరి అనుకుంటే సుదూర ప్రాంతాల మీదుగా వెళ్లాల్సి వచ్చేది. ఇక రోడ్ల పరిస్థితి ఆధ్వానంగానే ఉండేది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014 నుంచి రహదారులు, బ్రిడ్జిల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లతో పాటు చిన్న రోడ్లను బీటీ రోడ్లుగా నిర్మించారు. వాగులు ప్రవహించే కాజ్‌వేల వద్ద హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 2014 నుంచి ఇప్పటివరకు ఆర్అండ్బి, పంచాయతీరాజ్ శాఖలకు 29 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.133.84 కోట్లు మంజూరయ్యాయి. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి ప్రధాన రహదారుల్లో 24 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.121.6కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 5 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.12.18 కోట్లు మంజూరయ్యాయి.
24 బ్రిడ్జిలు రూ.121.6 కోట్లు..
వికారాబాద్ జిల్లా పరిధిలో 2014 నుంచి రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రోడ్లపై వాగుల వద్ద 24 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.121.6 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో బషీరాబాద్ నుంచి కరన్‌కోట్ రోడ్డులో కాగ్నా నదిపై నిర్మించే బ్రిడ్జికి రూ.13.40 కోట్లు, తాండూరు-కోట్‌పల్లి రోడ్డులో బ్రిడ్జికి రూ.8.90 కోట్లు, మహబూబ్‌నగర్-చించోలి రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.16.80 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి తాండూరు శివారు రోడ్డులో హై లెవల్ బ్రిడ్జికి రూ.3కోట్లు, వికారాబాద్-తాండూరు రోడ్డులో కిలోమీటరు 22/8-10, 23/8-10, 32/6-8 కిలోమీటర్ల వద్ద బ్రిడ్జికి రూ.15.30 కోట్లు, తాండూరు-తొర్మామిడి రోడ్డులో రోడ్డు విస్తరణతోపాటు బ్రిడ్జికి రూ.1.65 కోట్లు, జిన్గుర్తి-తట్టేపల్లి రోడ్డులో స్లాబ్ కల్వర్టుల నిర్మాణానికి రూ.1.50 కోట్లు, తాండూరు-ధారూరు రోడ్డులో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.70 కోట్లు, చిట్టెంపల్లి-లాల్‌పహడ్ రహదారిపై హై లెవల్ బ్రిడ్జికి రూ.5.25 కోట్లు, పరిగి-వికారాబాద్ రోడ్డులో నస్కల్ గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.89 కోట్లు, పరిగి-నంచర్ల రహదారిలో అంతారం సమీపంలో బ్రిడ్జిల నిర్మాణానికి రూ.6.70 కోట్లు, మర్పల్లి-కోట్‌పల్లి రోడ్డులో హై లెవల్ బ్రిడ్జికి రూ.2.50 కోట్లు, మన్నెగూడ-వికారాబాద్-సదాశివపేట్ రోడ్డులో బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణానికి రూ.2.90 కోట్లు, కేసారం-తొర్మామిడి రోడ్డులో హై లెవల్ బ్రిడ్జికి రూ.1.70 కోట్లు, వికారాబాద్-తంగడిపల్లి రోడ్డులో బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణానికి రూ.5.50 కోట్లు, శంకర్పల్లి-మర్పల్లి రోడ్డు, బుదేరా-మర్పల్లి రోడ్లలో బ్రిడ్జిల నిర్మాణానికి రూ.12.0 కోట్లు, మన్నెగూడ-వికారాబాద్-సదాశివపేట్ రోడ్డులో పలుచోట్ల బ్రిడ్జిలు, రోడ్డు వెడల్పుకు రూ.1.30 కోట్లు, బుదేరా-మర్పల్లి రోడ్డులో రోడ్డు వెడల్పు, హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.38 కోట్లు, మన్నెగూడ-వికారాబాద్-సదాశివపేట రోడ్డులో హై లెవల్ బ్రిడ్జికి రూ.1.90 కోట్లు, ఇదే రోడ్డుపై 33/2-4 కిలోమీటరు వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.90 కోట్లు, హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై కిలోమీటరు నం.96/6-8 వద్ద హై లెవల్ బ్రిడ్జికి రూ.3.50 కోట్లు, తుంకిమెట్ల-నారాయణపేట్ రోడ్డులో హై లెవల్ బ్రిడ్జికి రూ.2.04 కోట్లు, మహబూబ్‌నగర్-చించోలి రోడ్డులో కిలోమీటరు నం.33/4-8 వద్ద హై లెవల్ బ్రిడ్జికి రూ.2.75 కోట్లు, రావులపల్లి-మద్దూర్ రోడ్డులో కిలోమీటరు నం.5/6-8 వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.18 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 21 బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి కాగా, వాటిపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని మోమిన్‌పేట్, గాజీపూర్, దోర్నాల వద్ద బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నది. ఈ మూడు పూర్తయితే మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ఇకపోతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి మొత్తం 5 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.12.18 కోట్లు మంజూరయ్యాయి. నవాబుపేట్ మండలం చించల్పేట్ వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.9 కోట్లు, ముబారక్పూర్-గుబ్బడిఫత్తెపూర్ మధ్య బ్రిడ్జికి రూ.4.5 కోట్లు, కొడంగల్ నియోజకవర్గం పోచమ్మతండా వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.50 లక్షలు, పుడుగుర్తి-రాకంచర్ల మధ్య బ్రిడ్జికి రూ.1.48 కోట్లు, దౌల్తాబాద్ మండలం గుండేపల్లి వద్ద బ్రిడ్జికి రూ.1.8 కోట్లు మంజూరు కాగా, పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
వర్షం వచ్చిందంటే రవాణాకు రందే.. ఎప్పుడు కూలిపోతాయో తెలువని కల్వర్టులు, వాగులు పారే రోడ్లు ధ్వంసమై ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. అక్కడక్కడ పాత బ్రిడ్జిలు ఉన్నా ఎప్పుడు కూలుతాయోనని భయం గుప్పెట్లో ప్రయాణించాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రహదారులు, బ్రిడ్జిల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా నిర్మించి అవసరమున్న చోట కల్వర్టులను నిర్మించింది. వరద పారుగడి ఎక్కువ ఉన్న వాగుల వెంట ఉన్న రోడ్లపై బ్రిడ్జిలను నిర్మించింది. ఇందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వందల కోట్ల రూపాయలను వెచ్చించింది. దీంతో ఉమ్మడి జిల్లావాసుల రవాణా వెతలు తీరాయి. అంతేకాకుండా రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు వాగులు పారే రోడ్లపై వంతెనలు నిర్మించడంతో నిర్భయంగా వెళ్తున్నారు.
24 బ్రిడ్జిలకు రూ.121.6కోట్లు..
వికారాబాద్ జిల్లాలో ఆర్అండ్బీ రహదారుల్లో 24 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.121.6కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 21 బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తయ్యాయి. మూడు బ్రిడ్జిల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉన్నది. బ్రిడ్జిల నిర్మాణాలతో చాలావరకు ఇబ్బందులు తొలిగాయి. ప్రస్తుతం హై లెవల్ బ్రిడ్జిలపై నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి.
– భూక్యా లాల్‌సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఆర్అండ్బీ, వికారాబాద్ జిల్లా
రవాణా మెరుగుపడింది..
అల్వాల గ్రామ సమీపంలోని వాగుపై నిర్మించిన బ్రిడ్జితో రవాణా సౌకర్యం మెరుగుపడింది. గతంలో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యేవారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు కృతజ్ఞతలు.
– తిరుమలరెడ్డి శ్రీలత, సర్పంచ్, అల్వాల, కేశంపేట
సాఫీగా ప్రయాణం..
అంతారం, కాళమ్మ దగ్గర రెండు పెద్ద బ్రిడ్జిలు నిర్మించడంతో సాఫీగా ప్రయాణం సాగుతున్నది. గతంలో మైలమ్మ చెరువు వాగు రోడ్డుపైన ప్రవహించేది. అంతారం నుంచి కులకచర్లకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది.
– బోయిని మొగులయ్య అంతారం,కులకచర్ల మండలం
రాకపోకలు బందయ్యేవి..
కులకచర్ల కాళమ్మదేవాలయం, అంతారం దగ్గర వర్షకాలం వచ్చిందంటే రాకపోకలు బందయ్యేవి. తెలంగాణ ప్రభుత్వం కొత్త రోడ్డుతో పాటుగా బ్రిడ్జిలను నిర్మించడంతో ఇబ్బందులు తొలిగాయి. రాష్ట్ర సర్కార్‌కు కృతజ్ఞతలు.
– శివానంద్, అంతారం,కులకచర్ల మండలం
దూర భారం తగ్గింది..
రూ. 13 కోట్లతో కాగ్నా నదిపై నిర్మించిన బ్రిడ్జితో దూర భారం తగ్గింది. కర్ణాటక రాష్ర్టానికి రాకపోకలు ఏర్పడ్డాయి. ఇదివరకు నది పొంగినప్పుడు పొలం వద్దకు వెళ్లలేకపోయేవాళ్లం. ఇప్పుడు కష్టాలు తప్పాయి.
– కోటం మాణిక్‌రెడ్డి గ్రామస్తుడు (మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్)