తాండూరు, జూన్ 19 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తాండూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నది. వెనుకబడ్డ తాండూరుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించడంతో అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా రూ.78 కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు పనులు, రూ.42.74 కోట్లతో 7 చెక్‌డ్యాంలు, రూ.27 కోట్లతో కాగ్నానది-గౌతాపూర్ వరకు నేషనల్ హైవే, రూ.24 కోట్లతో తాండూరు-తొర్మాడి రోడ్డు పనులు, రూ.18 కోట్లతో తాండూరు-అడికిచర్ల, తట్టెపల్లి రోడ్డు పనులు, రూ.2 కోట్లతో అంతారం సమీపంలో మినీస్టేడియం, రూ.2 కోట్లతో ఆడిటోరియం పనులతో పాటు పలు అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులు నాణ్యతతో వేగంగా జరిగేలా ప్రత్యేక చొరవతీసుకుంటున్నారు. ఇచ్చిన గడువులో పనులను పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులతో పాటు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యరహిత తాండూరు ఏర్పాటుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో తాండూరు మండలం జినుగుర్తి సమీపంలో 260 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు, అంతారం సమీపంలో 12 ఎకరాల్లో లారీ పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
జోరుగా బైపాస్ పనులు..
తాండూరులో ట్రాఫిక్, వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు చుట్టూ 12కిలో మీటర్ల పొడవున రెండు వరుసలతో నిర్మించే బైపాస్ రోడ్డు పనులకు అడ్డంకులు తొలగడంతో రోడ్డు నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. వ్యాపార, వాణిజ్యంలో ముందున్న తాండూరులో సరుకుల ఎగుమతి, దిగుమతి ఎక్కువగా ఉంటుంది. సిమెంట్, నాపరాతి, సుద్ద ఫ్యాక్టరీలు ఉండడంతో భారీ వాహనాలు పట్టణంలోకి రానుండడంతో త్వరలో తాండూరు పట్టణంలో బైపాస్ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.78 కోట్లు విడుదల చేసింది. భూమి కోల్పోయిన రైతులకు ప్రభుత్వం 9.21 కోట్లు చెల్లించడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ రహదారి తాండూరు-కొడంగల్ వెళ్లే రోడ్డును అనుసంధానం చేస్తూ యాలాల మండలం బషీర్మియా తండా, కోకట్, రసూల్పూర్, తాండూరు మండలం అంతారం, చెంగోల్, గౌతాపూర్, మీదుగా చించోళ్లి రోడ్డును ఆనుకొని ఉన్న గౌతాపూర్ శివారు వద్ద కలువనున్నది. దీంతో తాండూరు పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ రోడ్డుకు కావాల్సిన మరో రూ.20కోట్ల నిధులు మంజూరు అయ్యేలా సీఎం కేసీఆర్‌ను విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
కొనసాగుతున్న రోడ్డు పనులు..
తాండూరు నియోజకవర్గ పరిధిలోని ఆర్‌ఆండ్‌బీ రోడ్లు ఇక సాఫీగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రత్యేక నిధులు కేటాయించి టెండర్లను పిలిచారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చక్కటి రోడ్లు వేసేందుకు శ్రీకారం చుట్టారు. 167 నేషనల్ హైవేలో భాగంగా రూ.27 కోట్లతో తాండూరు కాగ్నానది-గౌతాపూర్ వరకు రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.24కోట్లతో తాండూరు-తొర్మామిడి రోడ్డుతో పాటు రూ.18కోట్లతో వేస్తున్న అడికిచర్ల, తట్టెపల్లి రోడ్డు పనులు చివరి దశకు చేరుకున్నాయి. రూ.631కోట్లతో మహబూబ్‌నగర్-చించొల్లి రోడ్డు పనుల టెండర్ల ప్రక్రియ జరుగనున్నట్లు సమాచారం. గౌతాపూర్- కరణ్‌కోట్ రోడ్డు వేసేందుకు సర్కార్ ఆమోదం లభించింది. త్వరలో టెండర్లు వేసి పనులు ప్రారంభం కానున్నాయి. అంతారం సమీపంలో నిర్మిస్తున్న మినీస్టేడియం, ఆడిటోరియం పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. డీఎంఎఫ్టీ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, జిల్లా పరిషత్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి.
చెక్‌డ్యాం నిర్మాణాలు..
తాండూరు ప్రాంతంలో జల విప్లవం తీసుకువచ్చేందుకు కాగ్నా, కాక్రవేణి నదులపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాండూరు మండలం ఎల్మకన్య వాగులో రూ.7.2 కోట్లు, చిట్టిఘనాపూర్ వాగులో రూ.5.64కోట్లు, యాలాల మండలం కోకట్ వాగులో రూ.9.6కోట్లు, గోవిందపూర్ వాగులో రూ.4.7కోట్లు, పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి వాగులో రూ.3.5 కోట్లు, బషీరాబాద్ మండలం జీవన్గి వాగులో రూ.7.4కోట్లు, క్యాద్గీర వాగులో రూ.4.7 కోట్ల నిధులతో టెండర్లు వేసి చేపట్టిన నిర్మాణ పనులు ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయి. త్వరలో నియోజకవర్గంలోని ఖాంజాపూర్, చంద్రవంచ, మన్సాన్పల్లి, బెన్నూరు, దేవనూరు గ్రామ సమీపంలోని వాగుల్లో చెక్‌డ్యాం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నాణ్యతను పరిశీలించేందుకు సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
తాండూరు అభివృద్ధే లక్ష్యం
తాండూరు అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నాం. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి సహకారంతో వెనుకబడిన తాండూరు ప్రాంతానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే ఎక్కువ అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నాం. బైపాస్, హైవే రోడ్డు పనులతో పాటు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లేందుకు అనువుగా రోడ్డు పనులు చేపట్టాం. త్వరలో ఇండస్ట్రియల్ పార్కు, లారీ పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తాం.
– పి.రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్యే తాండూరు