పరిగి/కొడంగల్, జూన్ 16 : వికారాబాద్ జిల్లా ప్రజల కలను సాకారం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వికారాబాద్‌లో జిల్లా కోర్టు, వికారాబాద్ జిల్లాను చేయించలేకపోయిందన్నారు. గురువారం పరిగిలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, పరిగి, వికారాబాద్ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, ఆనంద్‌లతో కలిసి కోటి రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, అనంతరం 50 పడకల దవాఖానలో ఆపరేషన్ థియేటర్‌ను మంత్రి ప్రారంభించారు.
ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. వికారాబాద్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటుపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే, కలెక్టర్‌తో సమీక్షించామన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటు కావాలంటే 330 పడకల దవాఖాన కావాల్సి ఉంటుందని, వికారాబాద్‌లో 100 పడకల దవాఖాన అందుబాటులో ఉందని, మిగతా 230 పడకల దవాఖాన నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం వరకు, నేషనల్ మెడికల్ కౌన్సిల్‌వారు సందర్శించేందుకు వచ్చే సమయానికి 330 పడకల దవాఖాన పనులు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. దానికనుగుణంగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్ల నియామక ప్రక్రియ వెంటనే ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతగిరిలో 50 పడకల ఆయుష్ దవాఖాన నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
త్వరలో అందుబాటులోకి డయాలసిస్ సెంటర్
డయాలసిస్ చేయించుకునేందుకు పరిగి ప్రాంతంవారు తాండూరు, వికారాబాద్, మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నారని.. పరిగికి డయాలసిస్ సెంటర్ కావాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి కోరిక మేరకు పరిగిలో డయాలసిస్ సెంటర్ మంజూరు చేశామన్నారు. డయాలసిస్ సెంటర్‌ను 15 నుంచి 20 రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌ను ఆదేశించామన్నారు. పరిగి దవాఖానలో డిజిటల్ ఎక్స్‌రే మిషన్, పోస్టుమార్టం రూం, ప్రహరీ, జనరేటర్, మరిన్ని యంత్ర పరికరాలు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. పరిగి నియోజకవర్గానికి 3 పల్లె దవాఖానలు వెంటనే ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
స్టడీ మెటీరియల్ అందజేత
పరిగిలోని కొప్పుల శారద గార్డెన్-2లో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఉద్యోగార్థులకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లో మంత్రి స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకటి రెండు నెలలపాటు తాత్కాలిక ఆనందాలకు దూరంగా ఉండాలని, ఉద్యోగాలు సాధించి జీవితాంతం ఆనందంగా బతకాలని చెప్పారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఉచితంగా కోచింగ్ ఇప్పించడంతోపాటు భోజన వసతి కల్పించడం, స్టడీ మెటీరియల్ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్ నిఖిల, వికారాబాద్, నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్లు మురళీకృష్ణగౌడ్, రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి పరిగి, కొడంగల్, పూడూరు ఎంపీపీలు అరవిందరావు, ముద్దప్ప దేశ్‌ముఖ్, మల్లేశం, జడ్పీటీసీలు నాగారెడ్డి, హరిప్రియ, రాందాస్, నాగరాణి, అరుణాదేశు, మహిపాల్, సీనియర్ నాయకులు అనీల్‌రెడ్డి, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్లు జగదీశ్వర్‌రెడ్డి, అశోక్, జిల్లా వైద్యాధికారి తుకారాంభట్, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొడంగల్‌లో రూ.300 కోట్లతో పలు అభివృద్ధి పనులు
కొడంగల్ నియోజకవర్గంలో రూ.300 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన తండా గ్రామపంచాయతీల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.25 లక్షల చొప్పున, రహదారుల నిర్మాణానికి వెయ్యి కోట్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3వేల ఇండ్ల నిర్మాణానికి అనుగుణంగా నిధులు మంజూరు చేస్తారన్నారు. దుద్యాల, బాలంపేట, రుద్రారం గ్రామాలకు పల్లె దవాఖానలు, కొడంగల్‌కు అదనంగా 108 వాహనం, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాలకు జూనియర్ కళాశాలలు, పాత కొడంగల్ నుంచి నిర్మించే బీటీ రోడ్డుకు అదనంగా రూ.2 కోట్లు, దవాఖానలో పోస్టుమార్టం గదికి నిధులు, ఎక్స్‌రే పరికరం, కొడంగల్, మద్దూరు దవాఖానల్లో తగినంత వైద్య సిబ్బందిని నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొడంగల్‌లో మహిళా సంఘాల భవనానికి రూ.50 లక్షలు, అంబేద్కర్, ముదిరాజ్ భవన్ల నిర్మాణానికి రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
కోట్లాది నిధులతో అభివృద్ధి
కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ప్రత్యే కృషితో కోట్లాది నిధులు మంజూరై అభివృద్ధి కొనసాగడం ద్వారా కొడంగల్ రూపురేఖలు మారినట్లు తెలిపారు. రూ.300 కోట్లతో ప్రతి గ్రామానికి బీటీ, సీసీ రోడ్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 38 తండాలకు బీటీ రోడ్లు మంజూరు కావాల్సి ఉందన్నారు. మున్సిపల్ అభివృద్ధికి రూ.10కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. 9 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి కనీసం కొడంగల్ అభివృద్ధికి సం బంధించి ఓ చిన్న కాగితాన్ని కూడా ప్రభుత్వానికి అందించలేదని ఆరోపించారు.