తాండూరు, జూన్ 10 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి వేడుకలా జరుగుతున్నది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో సౌకర్యాలు మరింత మెరుగు పడుతున్నాయి. దీర్ఘకాలంగా తిష్టవేసిన అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి పేరుతో నిధుల వరదను కురిపించడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు బాధ్యతతో ఉత్సాహంగా పట్టణం, పల్లె ప్రగతిలో భాగస్వాములు కావడంతో ప్రగతి పరుగులు పెడుతున్నది. 2019 సెప్టెంబర్‌లో సర్కార్ పల్లె, పట్టణ ప్రగతిని ప్రారంభించింది. 2020 జనవరిలో రెండో విడుత, 2020 జూన్‌లో మూడో విడుత, 2021 జూలై 1 నుంచి నాలుగు విడుత, 2022 జూన్ 3 నుంచి ఐదో విడుత పల్లె ప్రగతి ప్రారంభమైనది. ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో జరిగిన పట్టణ, పల్లె ప్రగతితో జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు, ప్రత్యేక కమిటీ సభ్యులు, ప్రజలతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ గుణాత్మక మార్పు తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఎంతో కాలం తిష్టవేసిన వేల సంఖ్యల్లో సమస్యలు తీరాయి. వారం రోజులుగా కొనసాగుతున్న ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతి పనులు జోరుగా జరుగుతున్నాయి. పరిసరాల శుభ్రతతో పాటు ప్రధానంగా ప్రతి పల్లె, పట్టణంలోని ప్రతి వార్డుల్లో తెలంగాణ క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలతో పాటు పాడుపడ్డ పార్కులకు ప్రత్యేక నిధులు కేటాయించి క్రీడా మైదానంగా మార్చి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు
15 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతి పల్లె, పట్టణంలోని వార్డుల్లో ప్రతి రోజు పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు. వార్షిక, పంచవర్ష ప్రణాళికలు చేసి నియంత్రిత పద్ధతిలో విస్తృత భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా నిధులు వినియోగించి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పాడుబడ్డ గృహాలు, బావులతో పాటు జనావాస ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కల్గించే పొదలను, అపరిశుభ్రతను తొలగించేందుకు ప్రజలు స్వచ్ఛందంగ భాగస్వాములై పనులు చేస్తూ పల్లెలు, పట్టణాలను చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. ఇంకుడు గుంతలు తీస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తడి, పొడి చెత్తలను వేరు చేసి డంపింగ్ యార్డులో వేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకుండాప్లాస్టిక్పై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రత్యేక అధికారులు గ్రామాలు, పట్టణాల్లో పరిశీలిస్తున్నారు.
ప్రజల్లో జోష్…
అభివృద్ధి కోసం వార్డుల్లో నేతలు, ప్రజలు సమష్టిగా ముందుకొచ్చి శ్రమదానాలు, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతో అభివృద్ధి పరుగు పెడుతోంది. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పట్టణాల్లో ప్రత్యేక డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయడంతో పాటు వార్డుకో ప్రత్యేక వాహనాన్ని కేటాయించారు.
అధికారుల పర్యటన
ప్రత్యేక అధికార యంత్రాంగం నిత్యం చురుకుగా వార్డులను పర్యటిస్తున్నారు. కలెక్టర్ నిఖిల పట్టణం, గ్రామాల్లో వార్డులను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ సిబ్బందిని ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తున్నారు. తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి నాలుగు మున్సిపాలిటీలతో పాటు జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు ప్రగతివైపు పరుగులు పెడుతున్నాయి.