పరిగి, జూన్ 6: నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రైతులు కూరగాయలు, ఆకుకూరలను అధికంగా సాగు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి దగ్గరగా వికారాబాద్ జిల్లా ఉండటంతో ఈ ప్రాం తంలో పండించిన కూరగాయలను హైదరాబాద్‌లోని పలు మార్కెట్లకు తరలించి రైతులు లాభాలను పొందుతున్నారు. ఈ వానకాలంలో వికారాబాద్ జిల్లా పరిధిలో సుమారు 13,357 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరల ను సాగు చేయాలని ఉద్యానవన శాఖ అధికారు లు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో, రైతుల వారీగా ఏ కూరగాయలను ఎన్ని ఎకరాల్లో సాగు చేయనున్నారో మండలాలవారీగా అధికారులు లెక్కతేల్చారు.
అత్యధికంగా నవాబుపేట, వికారాబాద్ మండలాల్లో..
వికారాబాద్ జిల్లా పరిధిలోని నవాబుపేట, వికారాబాద్ మండలాల్లోనే అత్యధిక విస్తీర్ణంలో కూరగాయలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 13,357 ఎకరాల్లో ఈసారి కూరగాయల ను సాగు చేసేందుకు ఉద్యానవన శాఖ అధికారు లు ప్రణాళికలు రూపొందించారు.
సబ్సిడీపై కూరగాయల నారు
హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలో గల హైటెక్ నర్సరీల్లో పెంచిన కూరగాయ ల నారును రైతులకు 90శాతం సబ్సిడీపై అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జీడిమెట్ల నర్సరీల్లో టమాట, వంకాయ, పచ్చిమిరప నారు లభిస్తున్నది. నారు అవసరమైన రైతులు ఎంత విస్తీర్ణంలో సాగు చేయనున్నారో 40 రోజు ల ముందుగానే అధికారులకు తెలియజేస్తే వారు ఉద్యానవన శాఖ అధికారులకు ఇండెంట్‌ను పంపిస్తారు. అందుకనుగుణంగా నారును పెంచి రైతులకు అందజేస్తారు. సాధారణంగా టమాట, వంకాయలను ఎకరాకు 8వేల మొక్కలు, పచ్చిమిరప ఎకరానికి 6,400 మొక్కలు నాటుతారు. ఒక ఎకరం మిరప నారు కోసం రైతులు రూ. 1280, టమాట, వంకాయ నారుకోసం రూ. 1500 డీడీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రైతులకు 90 శాతం సబ్సిడీకి ఈ నారు లభిస్తుంది. మరోవైపు ఎకరా కూరగాయలకు ఇన్పుట్ లేదా రవాణా కోసం రూ.500 అందజేస్తారు. హైటెక్ నర్సరీల్లో పెంచిన టమాట, వంకాయ, మిరప నారు రైతులు సాగు చేస్తే త్వరగా పెరిగే అవకాశాలుంటాయని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నాణ్యమైన మేలు రకం, అధిక దిగుబడిని ఇచ్చే రకాల నారు ఇక్కడ లభిస్తుంది. తద్వారా ఈ మూడు రకాల నార్లు పోయకుండా నేరుగా జీడిమెట్ల నుంచి కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది.
జిల్లాలో కూరగాయల సాగు పెరిగే అవకాశం
వికారాబాద్ జిల్లాలో ఈ సీజన్లో 13,357 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలను రైతులు చేయనున్నట్లు అంచనా వేస్తు న్నాం. ఈ సీజన్లో కూరగాయల సాగు మరింత పెరిగే అవకాశం ఉన్నది. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండటంతో మార్కెటింగ్ సదుపాయం ఉంటుంది. అందువల్ల కూరగాయలు ఎంత సాగు చేసినా ఇబ్బంది లేదు. జీడిమెట్లలోని హైటెక్ నర్సరీల టమాట, వంకాయ, మిరప నారును సబ్సిడీపై రైతులకు అందిస్తున్నాం.
– చక్రపాణి, వికారాబాద్ జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి