పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి, నాల్గో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వీధులను శుభ్రం చేయిస్తున్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తీయించడంతోపాటు పాడుబడిన, శిథిలమైన కట్టడాలను సిబ్బందితో తొలగింపజేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రగతి పనుల్లో భాగస్వాములవుతున్నారు. అధికారులు పల్లెలు, పట్టణాల్లో సభలు నిర్వహించి పల్లె, పట్టణ ప్రగతి ఆవశ్యకతను వివరిస్తున్నారు. పారిశుధ్యం, డంపింగ్ యార్డుల నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ఇంకుడు గుంతలతో కలిగే ప్రయోజనం, ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై వివరిస్తున్నారు.
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఊరూరా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.. ఆదివారం గ్రామగ్రామాన పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు పారిశుధ్యం, డంపింగ్ యార్డుల నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. బడంగ్‌పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు అర్జున్, బోయపల్లి దీపికా శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్ పల్లపు శంకర్, సర్పంచులు రామకృష్ణారెడ్డి, సాయిలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బడంగ్‌పేట/పహాడీషరీఫ్/కందుకూరు, జూన్ 5: బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 28,21, 25వ డివిజన్లో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి హాజరయారు. కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్‌రెడ్డి, లిక్కి మమతా కృష్ణారెడ్డితో కలిసి కాలనీవాసులతో సమావేశం ఏర్పాటు చేసి, పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. డ్రైనేజీ, చెత్త, విద్యుత్ వంటి సమస్యలపై చర్చించారు. రోడ్లపై చెత్త వేయకుండా చొరవ తీసుకోవాలన్నారు. 5వ డివిజన్లో కార్పొరేటర్ బోయపల్లి దీపికా శేఖర్‌రెడ్డి కాలనీ వాసులతో కలిసి చీపుర్లతో రోడ్లను ఊడ్చారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టారు. కాలనీల్లో ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.
పట్టణ ప్రగతితో మరింత అభివృద్ధి..
పట్టణ ప్రగతితోనే మరింత అభివృద్ధి జరుగుతుందని 19వ వార్డు కౌన్సిలర్ పల్లపు శంకర్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీరామకాలనీలో అధికారులు, పారిశుధ్య సిబ్బందితో సమావేశం నిర్వహించి, వార్డులో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాలు స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు పట్టణ ప్రగతి కార్యాక్రమాన్ని రూపకల్పన చేశారన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్వచ్ఛతతో పాటు మౌలిక సమస్యలు తీరుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రగతి సూపర్వైజర్ వనం రామచంద్రం, వార్డు ఇన్చార్జి శేఖర్, మున్సిపల్ సూపర్వైజర్ కుమార్, పారిశుధ్య కార్మికులు టీఆర్ఎస్ నాయకుడు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల పరిధిలోని నేదునూరు, మాదాపూరు గ్రామాల సర్పంచులు కాసుల రామకృష్ణారెడ్డి, మంద సాయిలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం నేదునూరు అనుబంధ గ్రామం మాన్యగూడ, మాదాపూరు గ్రామాల్లో సర్పంచులు ఆధ్వర్యంలో శ్రమదానం చేసి రోడ్లను పరిసరాలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు దాసర్లపల్లి ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, కార్యదర్శి రాఘవేందర్, వార్డు సభ్యులు, పర్వతాలు, ముద్దంగుల శివకుమార్, శివరాజ్, చంద్రశేఖర్, సూర్యప్రకాశ్, లక్ష్మణ్, సాయిరాం, ఉపేందర్, నవీన్ డ్వాక్రా మహిళలు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.