వికారాబాద్, మార్చి 25 : ఇండస్ట్రీయల్ పార్క్‌కు భూములను ఇచ్చేందుకు సమ్మతి తెలిపిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం మంగళవారం నాడు జరిగింది. ఈ సందర్భంగా దుద్యాల మండలం హకీంపేటకు చెందిన 114 మంది రైతులతో సంప్రదింపులు జరిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. హకీంపేట గ్రామంలో మొత్తం 146.34 ఎకరాల పట్టా భూమి ఉందని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతులతో అగ్రిమెంట్ చేసుకుని ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ నిర్ణయం ప్రకారమే అవార్డు, చెక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని అన్నారు. సమ్మతి అవార్డు పొందిన రైతులకు ఒకే విడతలో చెక్కుల ద్వారా నష్ట పరిహారాన్ని చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎకరానికి రూ.20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు, అర్హత మేరకు ఇంటికి ఒక ఉద్యోగం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ లింగ్యా నాయక్ , తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్ రెడ్డి , టీజీఐఐసీ జోనల్ మేనేజర్ ఓవిటీ. శారద, అసిస్టెంట్ జోనల్ మేనేజర్ అజీమా సుల్తానా, దుద్యాల మండలం తహశీల్దార్ కిషన్, హకీంపేట రైతులు పాల్గొన్నారు.