
కులకచర్ల, ఆగస్టు 12: అది ఒక చిన్న గ్రామం. పెద్ద పంచాయతీలోంచి విభజించబడి కొత్తగా ఏర్పడిన పంచాయతీ. పల్లె ప్రగతిలో భాగంగా చెరువు ముందలితండా(ఏ) అభివృద్ధి పనుల్లో ఆదర్శంగా దూసుకుపోతున్నది. అంతారం పంచాయతీ నుంచి నూతనంగా చెరువుముందలితండా(ఏ) పంచాయతీ ఏర్పడింది. ఈ తండాలో 517 జనాభా, 450 మంది ఓటర్లు ఉన్నారు. 150 కుటుంబాలు ఉన్నాయి. పంచాయతీకి నేరెళ్లకుంట తండా, హరిశ్చంద్రనాయక్ తండాలు అనుబంధ గ్రామాలు ఉన్నాయి.
కులకచర్ల మండలం చెరువు ముందలితండా(ఏ) పంచాయతీ అభివృద్ధి పథంలో కొనసాగుతున్నది. గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో సర్పంచ్ ఉత్సాహంతో పనులు చేయడంతో తక్కువ సమయంలో అన్ని పనులు పూర్తిచేశారు. వైకుంఠధామం, డంపింగ్ యార్డు, కంపోస్ట్ షెడ్డు, పల్లె ప్రకృతి వనం, గ్రామానికి వెళ్లే రోడ్డుకిరువైపులా పచ్చని అందాలు పరుచుకున్నట్లుగా హరితహారం మొక్కలు, సీసీ రోడ్లు, రైతులకు కల్లాలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు, అదనపు గ్రామాలకు మట్టి రోడ్లు వంటి పనులతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు సర్పంచ్ పద్మ రవిలాల్.
చెరువు ముందలితండా పంచాయతీలో రూ.35 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. పంచాయతీ సమీపంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఆకట్టుకుంటోంది. పల్లె ప్రకృతి వనాన్ని గుట్టపై ఏర్పాటు చేసి, అందులో అన్ని రకాల మొక్కలు నాటారు. వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు. గ్రామంలో పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ పంచాయతీ ట్రాక్టర్‌తో తడి, పొడి చెత్తను సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ చెత్తతో కంపోస్టు ఎరువులు తయారు చేసి, హరితహారం, పల్లె ప్రకృతి వనంలోని మొక్కలకు వేస్తున్నారు. పంచాయతీకి వెళ్లే దారిలో రోడ్డుకిరువైపులా మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నారు. దీంతో అవి పచ్చని అందాలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని శుభ్రం చేయడానికి కల్లాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో 25 మంది రైతులు కల్లాలను, పశువుల షెడ్లను నిర్మించుకున్నారు. పంటను కల్లాల్లో ఆరబెట్టుకుంటున్నారు. పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాలతో నీటిని సరఫరా చేస్తున్నారు.
చెరువుముందలితండా పంచాయతీ అనుబంధ గ్రామాలు ఉన్న హరిశ్చంద్ర నాయక్ తండా, నేరెళ్లకుంట తండాకు పంచాయతీ నిధుల ద్వారా మట్టి రోడ్లు నిర్మించారు. పంచాయతీతో పాటు అనుబంధ గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. మురుగునీటి కాల్వలు ఏర్పాటు చేశారు. వైకుంఠధామం, డంపింగ్ యార్డు, కంపోస్ట్ షెడ్డు, పల్లె ప్రకృతి వనం అన్ని పనులు పూర్తి చేశారు.
గ్రామాన్ని మండలంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే పల్లె ప్రగతిలో భాగంగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశాం. వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతివనం ఏర్పాటుచేశాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్తులకు అందేలా తమవంతు కృషిచేస్తాం. గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
– పద్మ, సర్పంచ్, చెరువుముందలితండా
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగం గా అన్ని అభివృద్ధి పనులు పూర్తిచేశాం. గ్రామంలో పరసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటు న్నాం. ఎప్పటికప్పుడు మురుగునీటి కాల్వల పరిశుభ్రత నిర్వహిస్తున్నాం. ప్రతి రోజు గ్రామంలో చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను సర్పంచ్ ఆధ్వర్యంలో పరిష్కరిస్తున్నాం. – భీమ్‌లు, పంచాయతీ కార్యదర్శి
ప్రభుత్వం పంచాయతీల అభివృ ద్ధి కోసం నిధులు కేటాయించడం అభినందనీయం. గతంలో నిధుల్లేక సమస్యలతో సతమతమయ్యే ది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు చాలా బాగున్నాయి. పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి పనులన్నీ పూర్తిచేశారు.