
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 7 : కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న వారందరికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. రజక, నాయీబ్రాహ్మణులకు కరెంటుబిల్లు బాధలను తప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా ఆయా కుటుంబాల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి స్వయంగా వారి మేలు కోసం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చారు. అందులో భాగంగా ఈ నెలలో రజకులు, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడంతో అర్హులు ధ్రువపత్రాలతో ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు.
దండిగా దరఖాస్తులు
250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకానికి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. అర్హులైనవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. వారు తహసీల్దార్ ధ్రువీకరణపత్రం, షాపు కిరాయి తీసుకున్న ఒప్పందపత్రం, దరఖాస్తుదారుడి ఆధార్‌కార్డు, 4 పాస్‌పోర్టుసైజ్ ఫొటోలు, మీటర్ రీడింగ్ బిల్లు జిరాక్స్‌తో నేరుగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే జిల్లాలోని బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 2వేల వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి విద్యారెడ్డి తెలిపారు. నాయీబ్రాహ్మణుల నుంచి 462 దరఖాస్తులు రాగా.. 1500 వరకు రజకుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అర్హులుగా ఉండి దరఖాస్తు చేసుకోలేని స్థితిలో ఉన్నవారికి సంబంధిత శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో గ్రామాల్లో చాటింపు వేయించి దరఖాస్తులు కోరుతున్నారు.
విద్యుత్ బిల్లుల భారం ఉండదిక..
క్షౌరశాలలు, లాండ్రీషాపులు, దోబీఘాట్లకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వం 250 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరాలను జిల్లాలోని రజకులు, నాయీబ్రాహ్మణులు పూర్తిస్థాయిలో అందిపుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు తహసీల్దార్ కార్యాలయాల నుంచి కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయా కులాల్లో విద్యావంతులు లేకపోవడంతో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశముండటంతో వారందరికి ఊరట లభించింది. దీంతో వారు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రజకులు, నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ఇంతలా కృషిచేయలేదని, క్షౌరశాలలు, లాండ్రీషాపులు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ అందజేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రజకులకు గొప్ప వరం : మైలారం విజయ్‌కుమార్,
రజక యువసేన రాష్ట్ర నాయకుడు
ఎన్నో ఏండ్లుగా కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న రజకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం గొప్ప వరం. ప్రభుత్వానికి యావత్తు రజకజాతి రుణపడి ఉంటుంది. ప్రభుత్వం రజక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషిచేయాలి.
సీఎం రుణం తీర్చుకోలేనిది : వెంకటేశ్
మార్కెట్లో క్షౌరానికి సంబంధించిన అన్ని వస్తువులకు ధరలు పెరుగడంతోపాటు ప్రతి నెల వెయ్యి రూపాయల వరకు కరెంటు బిల్లులు కట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. కేసీఆర్ ఉన్నతాశయంతో మా కష్టాలు తెలుసుకుని క్షౌరశాలలకు ఉచితంగా విద్యుత్ అందజేయడం సంతోషకరం. ప్రతి నెల విద్యుత్ బిల్లులు తప్పించిన సీఎంకు నాయిబ్రాహ్మణులమంతా రుణపడి ఉంటాం.
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం
విద్యారెడ్డి, జిల్లా బీసీ సంక్షేమాధికారి
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 250 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నవారు కరెంటు బిల్లులు అప్లోడ్ చేయాలి. పూర్తి వివరాలు పొందుపర్చాలి. తప్పులేమైనా ఉన్నా, వివరాలు సరిగ్గా పొందుపర్చకపోయినా వారికి ఎడిట్ ఆప్షన్‌ను ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తులో వివరాలు ఎడిట్ చేసుకుని పొందుపర్చాలి. లాండ్రీ, దోబీఘాట్, సెలూన్ నిర్వాహకులు నడిపే షాపునకు కమర్షియల్ ఎలక్ట్రిసిటీ మీటర్ ఉండాలి. ఇంటి మీటర్ ఉంటే దరఖాస్తు చేసుకునేటప్పుడు న్యూ అని ఆప్షన్ పెట్టుకోవాలి. అలా ఆప్లయ్ చేసుకున్నవారికి ప్రభుత్వం కొత్త మీటర్ అందజేస్తుంది.