
లక్ష్యం కోటి చేప పిల్లలు
89 లక్షల చిన్న చేప పిల్లలు, 25 లక్షల పెద్ద చేప పిల్లలు
జిల్లాలోని 830 పెద్ద, చిన్న చెరువులు.. 10 ప్రాజెక్టుల్లో పెంచేందుకు నిర్ణయం
ఆగస్టు మూడో వారంలో కార్యక్రమానికి శ్రీకారం
ఈ నెల 14వ తేదీ వరకు టెండర్లు
వికారాబాద్, జూన్ 6, (నమస్తే తెలంగాణ) : కోటి చేప పిల్లలు పెంచడమే లక్ష్యంగా జిల్లా మత్స్యశాఖ కసరత్తు చేస్తున్నది. శనివారం టెండర్లు ప్రారంభం కాగా, 14వ తేదీ వరకు కొనసాగనున్నది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు తెలిపారు. జిల్లాలో 105 మత్స్య సంఘాలుండగా.. 4400 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికి ఉచితంగానే చేపపిల్లలను అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో చేపల పెంచనున్నారు.
రూ.40కోట్ల ఆదాయం
89 లక్షల చిన్న చేప పిల్లలు, 25 లక్షల పెద్ద చేప పిల్లలను జిల్లాలోని 830 పెద్ద, చిన్న చెరువుల్లో పెంచేందుకు నిర్ణయించారు. వీటితో పాటు పది ప్రాజెక్టుల్లో కూడా చిన్న చేప పిల్లలను పెంచేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లాస్థాయిలో జిల్లా కమిటీ ఏర్పాటుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కార్యదర్శులను, ప్రత్యేకాధికారులతో కలిపి గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. చేప పిల్లలను వదిలేందుకు ఆగస్టు మూడో వారంలో శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది 94.08 లక్షల చేప పిల్లలు పంపిణీ చేశారు. 830 చెరువులు..10 ప్రాజెక్టులు
ఈ ఏడాది కూడా చిన్న చేపపిల్లలు (35-40మి.మీ), పెద్ద చేపపిల్లలు (80-100మి.మీ) రెండు రకాలు ఉన్నాయి.
అయితే ఈ చేప పిల్లలను కృష్ణా జిల్లా కైకలూరు మండలం నుంచి తీసుకురానున్నారు. 89 లక్షల చిన్న చేప పిల్లలను, 25 లక్షల పెద్ద చేప పిల్లలను 830 చెరువుల్లో వదిలేందుకు ఏర్పాట్లు చేయగా.. ప్రస్తుతం 536 చెరువులను గుర్తించారు. ఆరు మాసాలు నీళ్లు నిల్వ ఉండే చెరువుల్లో చిన్న చేప పిల్లలను, 9 నెలలు నిల్వ ఉండే చెరువుల్లో పెద్ద చేప పిల్లలను పెంచేందుకు నిర్ణయించారు. పది ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వదిలేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కోట్పల్లి, సర్పన్పల్లి, జుంటుపల్లి, లక్నాపూర్ లాంటి మరో ఏడు వరకు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా కోటి14లక్షల చేప పిల్లల పెంపకం చేయనున్నారు. ఇందులో దాదాపు 50లక్షల వరకు చేప పిల్లలను కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలువనున్నారు. చిన్న చేప పిల్లలు 15 లక్షలు, పెద్ద చేపపిల్లలను 35లక్షలు కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 50 లక్షల చేప పిల్లలను ఇక్కడే అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని మోమిన్ పేటలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఉన్నది. ఇక్కడ 40లక్షల చేప పిల్లల పెంపకం చేసేలా సౌకర్యాలు ఉన్నాయి. మరో 10 లక్షలకు పైగా ఉత్పత్తి చేసేందుకు అవసరమైన నిర్మాణాలు చేయనున్నారు. ఇక్కడ 7.19 ఎకరాల స్థలం ఉన్నది. ఉపాధి హామీ పథకం నిధులతో పనులు ప్రారంభం చేశారు.
టెండర్లు పూర్తి కాగానే..
జిల్లాలో టెండర్లు పూర్తయిన వెంటనే చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతకు ముందే కలెక్టర్, జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి షెడ్యూల్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి సబితారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చెరువుల విస్తీర్ణానికి అనుగుణంగా చేప పిల్లలను పెంచేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. చేప పిల్లల పెంపకంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండాప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో గ్రామస్థాయి కమిటీలను సైతం ప్రభుత్వం నియమించనున్నది.
14 వరకు టెండర్లు..
చెరువులు నిండిన వెంటనే చేప పిల్లలను వదులుతాం. టెండర్ల ప్రక్రియ 5 నుంచి ప్రారంభం కాగా 14 వరకు కొనసాగనుంది. జిల్లాలో ఈ సంవత్సరం 1.14 కోట్ల చేప పిల్లలను 830 చెరువుల్లో వదిలేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం 536 చెరువుల్లో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వంద శాతం సబ్సిడీపై అందజేస్తున్నాం. గతేడాది 94.08లక్షల చేప పిల్లలను లక్ష్యంగా పెట్టుకున్నాం. దాదాపుగా రూ.40 కోట్ల మేర ఆదాయం వచ్చింది. జిల్లాలో 105 మత్స్య సంఘాలు ఉండగా.. 4400 మంది సభ్యులు ఉన్నారు.
దుర్గప్రసాద్, మత్స్య శాఖ
వికారాబాద్ జిల్లా అధికారి