Tandur ITI | తాండూరు రూరల్, ఏప్రిల్ 26 : అది విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాల్సిన విద్యాలయం.. కానీ ఆ ఐటీఐ కాలేజీలో విద్యార్థులు లేరు.. అసలు ఆ కాలేజీలో ప్రవేశాలు కూడా చేయట్లేదు. దీంతో ఖాళీగా ఉన్న ఐటీఐ ఇప్పుడు పశువులకు ఆవాసంగా మారింది. ఆవులు, గేదెల మేతకు మాత్రమే పనికొస్తుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఏర్పాటైన ఐటీఐ కాలేజీ దుస్థితి ఇది.
తాండూరు మండలం జినుగుర్తి గ్రామ సమీపంలోని ఐటీఐ కాలేజీ భవనాన్ని రూ.4 కోట్లతో నిర్మించారు. భవనంలో కంప్యూటర్లు, ఫర్నీచర్, రవాణా కోసం రెండు ఆటోలు, ఇతర కనీస అవసరాలను కల్పించారు. మౌలిక సదుపాయాలు కల్పించి ఏళ్లు గడుస్తున్నా.. ఇందులో విద్యార్థుల ప్రవేశాలను మాత్రం మొదలుపెట్టలేదు. పారిశ్రామిక సాంకేతిక శిక్షణ (ఐటీఐ) సంస్థలో ప్రిన్సిపల్, సహాయ ప్రిన్సిపల్తోపాటు ఇద్దరు అటెండర్లను కూడా ప్రభుత్వం నియమించింది. రోజు వచ్చి వారు అటెండెన్స్ వేసి పోతారు. మౌళిక సదుపాయాలతో పాటు ఫ్యాకల్టీ కూడా ఉన్నప్పటికీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారిపోయింది.
ఖాళీగా ఉండటంతో ఐటీఐ కాలేజీ ఆవరణ పశువులకు నిలయంగా మారింది. ఈ కార్యాలయ ఆవరణలోకి వచ్చి పశువులు మేత మేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ప్రాంతంలోని విద్యార్థినీ, విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలనే సంకల్పం గొప్పదే అయినా, ఆచరణలో మాత్రం సాధ్యపడటం లేదని వాపోతున్నారు. పదో తరగతి పాసైన విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటగా వేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ ప్రాంత విద్యార్థుల కల నేరవేరడంలేదు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి ఐటీఐ కాలేజీని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.