హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో కోట్ల రూపాయల భారీ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ డిస్ట్రిక్ అసోసియేషన్(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా భేటీలో హెచ్‌సీఏపై వెంకటేశ్వర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘హెచ్‌సీఏలో కొందరు పెద్దలు మాఫియాగా మారారు. కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ కేటాయించిన నిధులను కొల్లగొడుతున్నారు. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతిపై సమగ్ర విచారణ కోసం సీఐడీ, ఏసీబీ, డీజీపీకి ఫిర్యాదులు చేశాం. 2004లో 4 కోట్లు ఇచ్చిన విశాక కంపెనీకి ఇప్పుడు 69 కోట్లు చెల్లించే పరిస్థితి ఎందుకు ఎదురైంది.
హెచ్‌సీఏ..మంత్రి వివేక్ జేబు సంస్థగా మారింది. అవినీతిపై విచారణ పూర్తయ్యే వరకు వివేక్ మంత్రి పదవికి దూరంగా ఉండాలి. హెచ్‌సీఏలో కోట్ల కుంభకోణంపై సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్ వెంటనే స్పందించాలి. సొసైటీ రిజిస్ట్రేషన్ నుంచి హెచ్‌సీఏ గుర్తింపును రద్దు చేసి..గ్రామీణ క్రికెట్ అభివృద్ధి కోసం టీడీసీఏకు గుర్తింపు ఇవ్వాలని బీసీసీఐని కోరుతున్నాం. ఉద్దేశపూర్వకంగానే హెచ్‌సీఏ గత అధ్యక్షుడు జగన్మోహన్రావును అక్రమంగా అరెస్ట్ చేశారు. గత ఎన్నికల్లో ఆయన చేతిలో ఓడిన అమర్నాథ్ను అధ్యక్షునిగా ఎన్నుకుని నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు’ అని అన్నారు.
సీఐడీ విచారణ షురూ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)పై అందిన ఫిర్యాదులపై సీఐడీ విచారణ మొదలుపెట్టింది. అసోసియేషన్‌లో నెలకొన్న అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సీఐడీ రంగంలోకి దిగింది. 22 ఏండ్ల క్రితం హెచ్‌సీఏతో కుదిరిన ఒప్పందంలో భాగంగా రూ.69 కోట్ల నిధులు మళ్లీంపు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.