కొడంగల్, జులై 04 : టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని టీబీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలని అంగడి రైచూర్ పీహెచ్సీ వైద్యాధికారిణి డా. బుష్రా తెలిపారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో వైద్య సిబ్బంది టిబి ముక్త్ భారత్ అభియాన్ వందరోజుల ప్రణాళికలో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీబీ వ్యాధి పూర్తిస్థాయి నివారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీబీ వ్యాధికి సంబంధించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చెమటలు పట్టడం, గొంతు భాగంలో గడ్డలు ఏర్పడడం తదితర లక్షణాలు టిబి వ్యాధికి సంబంధించి ఉంటాయని అటువంటి వారు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించుకుని చికిత్సలు నిర్వహించుకోవాలని సూచించారు. కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా టీబీ పరీక్షలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
వైద్య శిబిరంలో మొత్తం 110 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఇందులో ఎవరికైనా వ్యాధి నిర్ధారణ కాబడినట్లు గుర్తించబడితే వారికి ఉచితంగా మందులతో పాటు పౌష్టిక ఆహారం ప్రతినెల రూ. 1000 బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గతంలో వ్యాధి బారిన పడ్డ వారితోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. టిబి వ్యాధిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ఈ వైద్య క్యాంపులో ఎంఎల్హెచ్బీ వైద్యులు డా. నికిత, డా. అశ్విని, డా. నిర్మల లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ రహత్ అలీ, ఏఎన్ఎం మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.