వికారాబాద్, జూన్ 13 : వైకల్యం కలిగిన వారిని గుర్తించి శస్త్ర చికిత్సలు చేయించినట్లయితే గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చిన వారమవుతామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ఆకర్ ఆశ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికారాబాద్, పూడూర్ మండలాలకు చెందిన వైద్యాధికారులు, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు ముందస్తు వైకల్య పరీక్షలు నిర్వహించడంపై అవగాహన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. గ్రామాల్లో పుట్టుకతోనే కాకుండా ఇతరత్రా కారణాల వల్ల వైకల్యం పొందిన వారిని గుర్తించి శస్త్ర చికిత్సలు చేయించడానికి ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. వైకల్యం కలిగిన వారిని గుర్తించి ఉచిత శస్త్ర చికిత్సలు చేయించడం మనందరం అదృష్టంగా భావించాలని కలెక్టర్ తెలిపారు. శస్త్ర చికిత్సల సందర్భంలో ఉచిత భోజన, రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. చికిత్సలు చేసేందుకు వీలుగా గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వీటిని సద్వినియోగం చేసుకునే విధంగా వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు . వైకల్యం ఉన్నవారికి శస్త్ర చికిత్సలతో పాటు ప్లాస్టిక్ సర్జరీలు కూడా ఉచితంగా చేయడానికి ముందుకు వచ్చిన ఆకర్ ఆశ చారిటబుల్ ట్రస్ట్ ను కలెక్టర్ అభినందించారు.