వికారాబాద్ : ఆర్ఎస్ఐ బి.అశోక్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్కు చేసిన సేవలు యువ సిబ్బందికి స్ఫూర్తిదా యకం అని జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్‌లో ఆర్ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందుతున్న బి.అశోక్ రెడ్డిని జిల్లా పోలీస్ కార్యలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అశోక్ రెడ్డి పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా ప్రస్థానం ప్రారంభించి హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ఎస్ఐగా, ఆర్ఎస్ఐగా పదోన్నతులు పొందారన్నారు.
ఆయన పోలీస్ శాఖకు నిబద్ధతతో విశేష సేవలందించారాని కొనియాడారు. ఎలాంటి రిమార్క్ లేకుండా క్రమశిక్షణతో విధులు నిర్వహించడం ప్రశంసనీయమని, ఆయన సేవలు యువ సిబ్బందికి స్ఫూర్తి దాయకమని అన్నారు. పోలీస్ ఉద్యోగం ఎంతో సవాలుతో కూడుకున్నదని, కుటుంబ సభ్యుల సహకారం లేనిదే ఇంత సుదీర్ఘకాలం సమర్థవంతంగా పనిచేయడం సాధ్యం కాదన్నారు. వారి త్యాగాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగంలో పదవీ విరమణ ఒక ముఖ్యమైన ఘట్టమని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి, ఎలాంటి మచ్చ లేకుండా పదవీ విరమణ చేస్తున్న అశోక్ రెడ్డి కి అభినందనలు తెలిపారు. పదవీ విరమణ తర్వాత ఆయన తన కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఏఓ జోతిర్మయి, తదితరులు పాల్గొన్నారు.