పరిగి, జూలై 28 : వికారాబాద్ జిల్లాలో ఇంటింటికీ జ్వర సర్వే కొనసాగుతున్నది. ప్రధానంగా డెంగీ, మలేరియా, ఇతర జ్వరాల బారిన పడితే వెంటనే చికిత్స చేయించేందుకు వీలుగా ఇంటింటికీ జ్వర సర్వే చేపడుతున్నారు. ముందుగా హై రిస్క్ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యశాఖవారు సర్వే చేపట్టగా.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసేందుకు కలెక్టర్ నిఖిల ఆదేశాల మేరకు విలేజ్ శానిటేషన్ కమిటీ ఆధ్వర్యంలోఇంటింటికీ జ్వర సర్వేను చేపడుతున్నారు. జిల్లా పరిధిలోని 566 గ్రామపంచాయతీలతోపాటు అనుబంధ గ్రామాల్లో ఈ సర్వే కొనసాగుతున్నది. గత సోమవారం ప్రారంభమైన ఈ సర్వే ప్రతి రోజూ చేపడుతూ ఎప్పటికప్పుడు సర్వే నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు. గ్రామాల్లో సర్వేను జిల్లాస్థాయి అధికారులు, మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రతి రోజూ 100 ఇండ్ల చొప్పున సర్వే
వికారాబాద్ జిల్లాలో 566 గ్రామపంచాయతీలు ఉండగా, ప్రతి గ్రామపంచాయతీలో విలేజ్ శానిటేషన్ టీంలు ఉన్నాయి. సంబంధిత గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎం, ఆశా వర్కర్, అంగన్వాడీ కార్యకర్తలతో కూడిన కమిటీలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. వాటిని యాక్టివేట్ చేస్తూ ప్రతి గ్రామంలో ఇంటింటి జ్వర సర్వేకు కలెక్టర్ ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ 100 ఇండ్ల చొప్పున ఉదయం 8 గంటల నుంచి ఈ సర్వే కొనసాగిస్తున్నారు. దీంతోపాటు జిల్లావ్యాప్తంగా హై రిస్క్ ప్రాంతాల్లో 25 ప్రత్యేక బృందాలతో సర్వే కొనసాగుతున్నది. గత సంవత్సరం, ఇటీవల డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల సర్వే జరుగుతున్నది. ప్రస్తుతం జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలతోపాటు మోమిన్‌పేట్ మండలంలో ఈ బృందాలు సర్వే చేస్తున్నాయి. ప్రత్యేక బృందాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో సర్వే చేసిన తర్వాత జిల్లాలోని ఇతర ప్రాంతాలకు పంపిస్తారు.
జ్వర లక్షణాలుంటే రక్త నమూనాల సేకరణ
సర్వే సందర్భంగా ఎవరికైనా జ్వర లక్షణాలు కనిపిస్తే వెంటనే వారి నుంచి రక్త నమూనాలు సేకరించి వికారాబాద్‌లోని టీ హబ్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపిస్తున్నారు. రక్త పరీక్ష అనంతరం డెంగీ, ఇతర జ్వరాలు ఉన్నట్లు నిర్ధారణ జరిగితే ఈ సమాచారాన్ని డయాగ్నస్టిక్ సెంటర్ వారు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేస్తున్నారు. వెనువెంటనే డెంగీ జ్వరం నిర్ధారణ జరిగిన ఇంటి చుట్టుపక్కల సుమారు 50 ఇండ్లలో మళ్లీ ప్రతి ఇంటింటికీ జ్వర సర్వేను చేపడుతారు. జ్వరాలు వచ్చినట్లు నిర్ధారణ జరిగిన వారికి అవసరమైన వైద్యాన్ని సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులుఅందజేస్తారు. డెంగీ జ్వరం వచ్చిన వ్యక్తి ఇంటి చుట్టుపక్కల దోమల లార్వాలను నాశనం చేసేందుకు యాంటీ లార్వా ఆపరేషన్ చేస్తారు. దోమల నివారణ మందు స్ప్రే చేయిస్తారు.
కొవిడ్ బూస్టర్ డోసు
ఇంటింటి సర్వే సందర్భంగా 18 నుంచి 59 సంవత్సరాల వరకు రెండు డోసులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోసు వేయనున్నారు. ప్రతి టీంలో ఏఎన్ఎంలు ఉండడంతో వారి వెంట కొవిడ్ వ్యాక్సిన్ తీసుకువెళ్తున్నారు. దీంతో అర్హులైన వారికి ఇంటి వద్దే బూస్టర్ డోసు వేయనున్నారు.
ఇంటింటికీ సర్వే : డాక్టర్ తుకారాంభట్, వికారాబాద్ జిల్లా వైద్యాధికారి
జిల్లాలోని విలేజ్ శానిటేషన్ టీంలు, ప్రత్యేకంగా 25 బృందాలతో ఇంటింటికీ జ్వర సర్వే చేపడుతారు. ఎవరికైనా జ్వర లక్షణాలుంటే రక్త నమూనాలు సేకరించి టీ హబ్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపిస్తారు. రక్త పరీక్షల అనంతరం జ్వరం ఉన్నట్లు నిర్ధారణ జరిగితే వారికి చికిత్స అందించడంతోపాటు చుట్టుపక్కల 50 ఇండ్లలో మళ్లీ సర్వే చేపడుతారు. కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నవారికి బూస్టర్ డోసు వేయనున్నారు.