బొంరాస్పేట, జూన్ 10: సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. ఇప్పటికే మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తున్నది. ఇప్పటికే గురుకుల పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లో బోధన సాగుతుండగా ఈ విద్యాసంవత్సరం నుంచే గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమంలో బోధనను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఆశ్రమ పాఠశాలల్లో మూడు నుంచి పదోతరగతి వరకు తెలుగు మీడియంలోనే విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పేద గిరిజన విద్యార్థులు కూడా పోటీ ప్రపంచంలో రాణించేందుకు వారికి కూడా మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం లో బోధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
9, 10 తరగతుల వారికి తెలుగు మీడియంలోనే బోధన సాగనున్నది. వికారాబాద్ జిల్లాలోని బొంరాస్పేట మండలం బొట్లవానితండా, కుల్కచర్ల మండలంలోని రాంపూర్, బండెల్కిచర్ల, కుల్కచర్ల, తాండూరులోని బాలికల పాఠశాల, చౌడాపూర్ మండలంలోని కొత్తపల్లి, మర్పల్లి గ్రా మాల్లో బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నా యి. ఈ ప్రాంతాల్లో గిరిజనుల జనాభా అధికంగా ఉండటం, ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాం తాలకు వలస వెళ్తుంటారు. దీంతో వారి పిల్లలను సమీపంలోని వసతి గృహాల్లో చేర్పిస్తుంటారు. ప్రభు త్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేద గిరిజన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఆశ్రమ పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.
2,021 మంది విద్యార్థులు..
వికారాబాద్ జిల్లాలోని ఏడు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 2,021 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులకు దశల వారీగా ఆంగ్ల మా ధ్యమంలో బోధించే విషయంలో శిక్షణను కూడా పూర్తి చేసింది. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారంతో ఎస్జీటీలకు ఆంగ్లంలో ఎలా బోధించాలనే విషయంలో హైదరాబాద్లో ఈ నెల 5వ తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. రెండో విడుతలో స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
నాణ్యమైన విద్య అందించేందుకే..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎస్జీటీ ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి కాగా.. రెండో విడుతలో స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నాం.
-కోటాజీ, జిల్లా గిరిజన సంక్షేమాధికారి, వికారాబాద్