తుర్కయాంజాల్, ఏప్రిల్ 9 : ప్రణాళికాబద్ధంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలోని 19, 22, 23వ వార్డు, ఇంజాపూర్-24వ వార్డులో రూ. 2.21 కోట్లతో చేపట్టనున్న వాటర్ పైపులైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దశల వారీగా ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. పనుల ప్రాధాన్యతను బట్టి నిధులు కేటాయించాలి తప్ప వార్డుల వారీగా కాదన్నారు.
వార్డుల్లో ముందుగా వాటర్ పైపులైన్, డ్రైనేజీ లైన్ వేశాకే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతలోపిస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. చెత్త రహిత మున్సిపాలిటీగా తుర్కయాంజాల్ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ మల్రెడ్డి అనురాధ, వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, కౌన్సిలర్లు కొశిక ఐలయ్య, కాకుమాను సునిల్, రమావత్ కల్యాణ్ నాయక్, కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, రంగారెడ్డి జిల్లా కౌన్సిలర్స్ ఫోరం అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ, కౌన్సిలర్లు జ్యోతి, తాళ్లపల్లి సంగీత, వేముల స్వాతి, భాగ్యమ్మ, కీర్తన, రవీందర్ రెడ్డి, శ్రీలత, ఉదయశ్రీ, అనురాద, అనిత, హరిత, మర్రి మాధవి, సునిల్ పాల్గొన్నారు.