వికారాబాద్, సెప్టెంబర్ 25 : గిరిజన వసతి గృహంలో పనిచేస్తున్న డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని వర్కర్స్ యూనియన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాములు అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వసతి గృహాల్లో పని చేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గిరిజన వసతి గృహాల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ వర్కర్లకు గత 7, 8 నెలల నుంచి జీతాలు రావడం లేదన్నారు. జీతాలు రాక పోవడంతో జీవనం గడవడం కష్టంగా మారిందని తెలిపారు.
పే స్కేల్ కూడా అమలుచేయాలన్నారు. ప్రమాద బీమా రూ.10లక్షలు అందించాలన్నారు. రిటైర్డ్ బెన్ఫిట్ రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సమ్మే కాలంలో వేతనాలు చెల్లించాలని సూచించారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని వారు కోరారు. జీతాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైన అధికారులు స్పందించి పెండింగ్ జీతాలు, మా సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. అనంతరం డీటీడీవో కమలాకర్‌రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్కర్లు శ్రీనివాస్, రాజు, సుమిత్ర, తారాబాయ్, లక్ష్మీ, పెద్ద రాములు, మంగమ్మ, శోభ, పద్మమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.