కులకచర్ల, ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ హయాంలో పచ్చదనంతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అసలే నీళ్లు లేక ఎండిపోతున్న చెట్లను కాపాడాల్సిందిపోయి.. వాటి జాడ కూడా తెలియకుండా ఉండేందుకు పంచాయతీ సిబ్బంది వాటికి నిప్పుపెడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలతో పాటు డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామాల వద్ద మొక్కలను నాటారు. వాటి నిర్వహణను ఒక ఉద్యమంగా చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాల వద్ద నాటిన మొక్కలపై దృష్టిపెట్టకపోవడంతో అవి ఎండకు ఎండిపోతున్నాయి. సమ్మర్లో మొక్కలను కాపాడుకునేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది. కానీ నిధులు లేవంటూ ట్యాంకర్లను నిరుపయోగంగా పక్కన పెట్టేస్తున్నారు. పైగా గ్రామాల్లో తాగునీటిని అందించేందుకే ఇబ్బంది పడుతుంటే.. మొక్కల సంరక్షణ ఎలా చేయగలమని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది బహిరంగంగానే చెబుతున్నారు.
నిర్వహణ నిధులు లేక ఎండి పోతున్న మొక్కలు
గతంలో ఏర్పాటు చేసిన మొక్కలకు నీటిని అందించక, వాటిని పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో చెట్లు ఎండిపోతున్నాయి. మొక్కలకు ప్రతి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి నీటిని అందించాల్సి ఉండగా అసలు వాటికి నీటిని అందించే పాపాన గ్రామ పంచాయతీ సిబ్బందికాని, పంచాయతీ కార్యదర్శులు కాని పోవడం లేదు. నీటి కొరత ఉంది, నిధుల కొరత ఉంది తాము ఏమి చేయలేమని పంచాయతీ కార్యదర్శులు తెలియజేస్తున్నారు. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. వారు పల్లెలను అస్సలు పట్టించుకోకపోవడంతో గ్రామ పంచాయతీలకు గ్రహణం పట్టింది.
బోట్యనాయక్తండాలో మొక్కలకు నిప్పు…
కులకచర్ల మండల పరిధిలోని బోట్యనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని వైకుంఠధామంలో ఏర్పాటు చేసిన మొక్కలకు నీరు అందక అవి ఎండిపోయాయి. వేల రూపాయలు ఖర్చు చేసి నాటిన ఈ మొక్కలు పెద్దగా అయిన తర్వాత నిర్వహణ లేకపోవడంతో ఎండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వాటిని కాపాడాల్సిందిపోయి.. వాటికి నిప్పు పెడుతున్నారు. ఈ విషయాన్ని చూసి కూడా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి హరితహారం ద్వార పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాల్లో నాటిన మొక్కలను సంరక్షంచాలని కోరుతున్నారు.
Botyanayak Thanda3