వికారాబాద్ : జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వరద( Flood ) ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించ డానికి మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్(KCR) ఎస్ఎన్డీపీ నిధుల నుంచి కోట్ల రూపాయలు కెటాయించారని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో నాలాల అభివృద్ధికి రూ.6.40 కోట్లతో చేపట్టనున్న పనులకు గురువారం ఆమె శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీలల్లో వరద ఉధృతి ఎక్కవగా ఉండటంతో ప్రత్యేక నాలాల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం చేయవద్దని సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కృషిచేసిన కాలనీవాసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాదీ, వైస్ చైర్మన్ పర్హానాజ్, మున్సిపల్ కమిషనర్ వసంత, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు ఉన్నారు.