పరిగి టౌన్ : దసరా ఉత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటన పరిగి మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని శమిపూజకు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ వర్గం వారు ఉద్దేశ పూర్వకంగా విద్యుత్ సరఫరా నిలిపివేసి రాళ్లు, కర్రలతో దాడి చేశారని, తమపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఓ వర్గం వారు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ లక్ష్మిరెడ్డి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారిని శాంతింపజేశారు.
శనివారం ఉదయం ఓ వర్గం వారు తమపై దాడి చేసిన వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పరిగి బస్టాండు దగ్గర ఆందోళన చేపట్టారు. దీంతో నేషనల్ హైవే 163పై రాకపోకలు నిలిచిపోయాయి. వినాయక నిమజ్జనం రోజున కూడా కావాలనే ఉద్దేశంతో ఓ వర్గం వారు తమను టార్గేట్ చేసి ఇబ్బందులకు గురి చేశారని తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారు మొండికేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఆందోళనకారులను సముదాయించి తన నివాసానికి పిలిచి ఇరువర్గాల వారితో దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు.