కులకచర్ల, జూలై 10 : వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థి ఆచూకీని పోలీసులు కనుక్కున్నారు. బండవెల్కిచర్ల గిరిజన గురుకుల కళాశాల నుండి మంగళవారం ఇంటర్ విద్యార్థి అదృశ్యం కాగా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అదృశ్యం అయిన విద్యార్థి కోస్గి సందీప్ కుమార్ గురువారం తిరుపతి రేణిగుంట రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు గుర్తించి వివరాలు అడగగా విద్యార్థి పూర్తి వివరాలు తెలియజేయడంతో విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేయించడంతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థి బంధువులు అక్కడికి చేరుకొని అతడిని ఇంటికి తీసుకువచ్చారు. విద్యార్థి సందీప్ కుమార్ ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.