పహాడిషరీఫ్( వికారాబాద్) : నియోజకవర్గంలో విషజ్వరాలు ( Toxic fevers) ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Mla Sabhita reddy) సంబంధిత అధికారులను ఆదేశించారు. జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలో ప్రబలుతున్న విష జ్వరాల కట్టడిపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు డెంగీ బారిన పడకుండా నివారణ చర్యలు చేపట్టాలని, శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ సరిగా చేపట్టడం లేదని, డ్రైనేజ్ మ్యాన్‌హోల్స్ సరిగా కవర్ చేయడం లేదని, డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకోవడం లేదని పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
ఎర్రకుంట ఓవైసీ కాలనీలో నూరి షా చెరువు నిండి నీరు బస్తీలోకి వస్తుందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి నీరు కిందికి విడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ చైర్మన్ ఫర్హానాజ్, కోఆప్షన్ సభ్యుడు సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పల్లపు శంకర్, అఫ్జాల్, అలీమ్, లక్ష్మీనారాయణ, హాజీ నవాబ్, తదితరులు పాల్గొన్నారు.