దౌల్తాబాద్ : పొలానికి బాట విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవి గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బండివాడ తండా గ్రామానికి చెందిన చౌహన్ బాబు నాయక్, అతడి తండ్రి బద్రి నాయక్, తమ్ముడు చౌహన్ వెంకట్ నాయక్‌లకు.. హనుమా నాయక్ తండాకు చెందిన ధనావత్ విజయ్ నాయక్, మాన్య నాయక్, వెంకట్ నాయక్, అజయ్ నాయక్, రవి నాయక్‌లకు పొలానికి బాట విషయంలో ఆదివారం మధ్యాహ్నం గొడవ జరిగింది.
ఇదే విషయంలో గత కొన్నేళ్లుగా వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం జరిగిన గొడవ అనంతరం చౌహన్ బాబు నాయక్ దౌల్తాబాద్ పీఎస్‌కు వెళ్లి ప్రత్యర్థులపై చేశారు. అనంతరం చౌహన్ బాబు నాయక్, అతడి చిన్న కొడుకు శ్రీరాములు ఒక బైకుపై, బాబూ నాయక్ తమ్ముడు వెంకట్ నాయక్, అతడి కొడుకు శ్రీధర్ నాయక్ మరో బైకుపై దౌల్తాబాద్ నుంచి తండాకు వెళ్తుండగా రాత్రి 10 గంటలకు మార్గమధ్యలో హనుమా నాయక్ తండా దగ్గర ప్రత్యర్థులు అడ్డగించారు.
తండాకు చెందిన ధనావత్ జైపాల్ నాయక్, ధనావత్ రాములు నాయక్, ధనావత్ మాన్యా నాయక్, ధనావత్ విజయ నాయక్, ధనావత్ వెంకట్ నాయక్, దనావత్ రవి నాయక్, ధనావత్ బాడ్క్య నాయక్, అమ్రి బాయి కలిసి బాబూ నాయక్ కుటుంబంపై కట్టెలతో, ఐరన్ రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో చౌహన్ బాబు నాయక్ కుడి చేయి, కుడి భుజానికి గాయాలయ్యాయి. బాబూ నాయక్ కొడుకు శ్రీరామ్ ఛాతిపై, కుడి చేయిపై కందిన గాయాలయ్యాయి.
బాబూ నాయక్ తమ్ముడు చౌహన్ వెంకట నాయక్ (37) తలకు బలమైన గాయమైంది. దాంతో అతడిని చికిత్స నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో హైదరాబాద్‌కు తీసుకుని వెళుతుండగా మార్గమధ్యలో మొయినాబాద్ దాటిన తర్వాత మధ్యరాత్రి ఒంటిగంట సమయంలో వెంకట్ నాయక్ చనిపోయినాడు. చౌహాన్ బాబు నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొడంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీధర్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.