పూడూరు,నవంబర్ 6 : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ ఎంపీపీ మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు దేవనోనిగూడ వెంకటయ్య, బీజేపీ నాయకుడు కంకల్ రవీందర్ ఆరోపించారు. హైదరాబాద్-మన్నెగూడ రోడ్డు విస్తరణతో పాటు అంగడి చిట్టంపల్లి గేట్ నుండి కంకల్ వరకు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ హైవే రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వివరించారు.
హైవే రోడ్డు పై వాహనాల రాకపొకల సంఖ్య రోజు రోజుకు పెరిగినా రోడ్డు విస్తరణ చేపట్టకపోవడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిట్టంపల్లి నుండి కంకల్ గ్రామం వరకు సుమారు 10 కిలో మీటర్ల మెరకు రోడ్డు పూర్తిగా గుంతలు పడి ప్రమాదకరంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కరోడ్డుకు కూడ నిధులు మంజూరు చేయలేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో కొన్ని గ్రామాలకు తారు రోడ్లు వేశారని వివరించారు.
వికారాబాద్ జిల్లాకు చెందిన సీఎం ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడి ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా హైవే రోడ్డుతో పాటు అంగడి చిట్టంపల్లి నుండి రంగారెడ్డి జిల్లా లాల్పహడ్కు వెళ్లె రోడ్డుని నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రఘవేందర్, జిల్లా నాయకుడు రాజు, బీఆర్ఎస్ మండల నాయకులు రహిస్ ఖాన్, రవి, యేసయ్య, మోహనచారి, శ్రీనివాసచారి, శేఖర్ తదితరలు ఉన్నారు.