కులకచర్ల(పరిగి), జూన్ 7: బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పరిగి ఎంఈవో గోపాల్ అన్నారు. శనివారం పరిగి మండల పరిధిలోని నస్కల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజయ్యతో కలిసి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు అన్ని వసతులను కల్పించడం జరిగిందని అన్నారు. పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటుకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి విద్యార్థుల పేర్లు నమోదు చేసుకున్నారు.
కులకచర్ల మండలం ఘనాపూర్‌లో…
కులకచర్ల మండల పరిధిలోని ఘనాపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీశారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్‌నాయక్ కోరారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన బోధన జరుగుతుందని, ఉచితంగా దుస్తులు, పుస్తకాలు, నోటు పుస్తకాలు అందించడం జరుగుతుందని తెలిపారు.