షాబాద్, డిసెంబర్ 23 : వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తున్నది. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా అత్యధికంగా రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. పండించిన పంటను మార్కెట్లో అమ్ముకునేందుకు అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. అసలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు అవసరం లేదని బీజేపీ నాయకులు మాట్లాడటం సరికాదని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్రం మోసం చేస్తుందని రైతులు మండిపడుతున్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి చేయడంతో పాటు రూ.వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు. దీంతో భారీగా కురిసిన వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. బోరుబావుల్లో నీటిమట్టం పెరుగడంతో అన్నదాతలు వరి, ఇతర పంటలు సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. రైతులు పండించిన పంటను కొనేందుకు కేంద్రం వెనకడుగు వేయడంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో క్లారిటీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వంపై అబద్దాలు మాట్లాడటం పట్ల రైతు సంఘాలు మండిపడుతున్నాయి. రైతుబిడ్డగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తుంటే, కేంద్రం మాత్రం రైతుల ఉసురు పోసుకుంటూ ఇబ్బందులు పెడుతున్నది. యాసంగిలో రైతులు పండించే ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనని, ధాన్యం కొనకుండా రైతును చులనక చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రైతులు చెబుతున్నారు.
పెరుగుదలకు అనుకూలంగా కొనుగోళ్లు ఏవి ?
తెలంగాణ రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చులకన భావంతో చూడడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై చూపిస్తున్న వివక్షాపూరిత వైఖరితో బీజేపీ నాయకులు ఏమి సమాధానం చెబుతారని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. పంజాబ్‌తోపాటు పలు ఇతర రాష్ర్టాల్లో పండించిన వరి ధాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్‌సీఐ తెలంగాణ పట్ల అవలంబిస్తున్న విధానం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పండించిన వివిధ పంటలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఉచితంగా అందజేయడంతోపాటు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి ఎకరాకు రూ.10వేలు అందజేస్తున్నారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. తద్వారా సాగు విస్తీర్ణంతోపాటు పంటల దిగుబడులు పెరిగాయి. ప్రస్తుతం పరిశీలిస్తే వానకాలంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే సుమారు 5లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పంజాబ్‌లో ఒక విధంగా.. తెలంగాణలో మరోలా
పంజాబ్‌లో పండిన పూర్తిస్థాయి వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో కొనబోమని చెప్పడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. తెలంగాణలో వానకాలం, యాసంగి రెండు సీజన్లలో రైతులు వరి పంటను సాగు చేస్తారు. పంజాబ్‌లో పూర్తిస్థాయి కొనుగోళ్లు చేపడుతున్నప్పుడు తెలంగాణలోనూ రెండు సీజన్లలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. యాసంగిలో పండిన వరి ధాన్యం నూకలు అధికంగా అవుతాయి. అందువల్ల బాయిల్డ్ రైస్‌గా అధికంగా వస్తాయి. కానీ కేంద్ర ప్రభుత్వం యాసంగి బాయిల్డ్ రైస్ కొనబోమని తేల్చి చెప్పడం సరైన పద్ధతి కాదని రైతాంగం పేర్కొంటున్నది. వానకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు సైతం పూర్తిస్థాయిలో చేపట్టాలని కోరేందుకు మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రి పియుష్గోయల్ను కలవగా ‘మీకేమి పనిలేదా’ అంటూ అవమానకరంగా మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కారుకు మొదటి ప్రాధాన్యత రైతుల సంక్షేమమేనని, కేంద్రానికి ప్రాధాన్యత క్రమంలో చివరిది వ్యవసాయమని పలువురు పేర్కొంటున్నారు. మంత్రులు, ఎంపీల పట్ల కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలు తెలంగాణ రైతులను చులకన భావంతో చూసేలా ఉన్నాయన్నది స్పష్టమవుతున్నది. వ్యవసాయానికి సంబంధించి పంటల సాగుకు పెట్టుబడి సాయం ఎకరాకు రూ.10వేలు, 24 గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంటు అందజేయడం దేశంలో బీజేపీ పాలిత రాష్ర్టాలే కాకుండా ఏ ఒక్క రాష్ట్రంలో లేదని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ర్టానికి చెందిన రైతులకు మద్దతుగా నిలిచి పండించిన పంటనంతా కొనుగోలు చేయాల్సిన కేంద్రం తన బాధ్యతలు విస్మరించిందని చెప్పవచ్చు. బీజేపీకి రైతులే గుణపాఠం నేర్పించనున్నారు.
చులకనగా మాట్లాడడం సిగ్గుచేటు
రైతులంటే కేంద్ర ప్రభుత్వానికి అంత చులకన ఎందుకని రైతు సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్తే మంత్రులను సైతం లెక్కచేయకుండా కేంద్ర మంత్రి మాట్లాడటం సిగ్గుచేటు. ధాన్యాన్ని కొనుగోలు చేయమని నిర్భయంగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతుల సత్తా ఏంటో చూపిస్తాం.
వడ్లు కొనకపోతే రైతు ఆగమే
యాసంగిలో పండించిన వడ్లను కేంద్రం తప్పకకొని తీరాల్సిందే. లేకపోతే రైతు బతుకంతా ఆగమే. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వడ్లు కొనబోమని చెప్పడం రైతులను విస్మరించడమే. మా ప్రాంతంలో కొన్ని భూముల్లో వరిపంట మాత్రమే పండుతుంది. వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలంటే పండవు. అలాంటప్పుడు పండించిన వడ్లను ఎక్కడ అమ్ముకోవాలి. -శ్యామలయ్యగౌడ్,
రేగడిమైలారం, బొంరాస్‌పేట మండలం
రైతులను మోసం చేయడం సరికాదు
కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతును చులకన చేయడం సరికాదు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు ఏర్పాటు చేసి చెరువులు నింపడంతో బోర్లలో నీరు పుష్కలంగా పెరిగింది. దీంతో పంటలు పండిస్తే కేంద్రం కొనకుండా మోసం చేస్తే ఎట్లా. రైతులను ఇబ్బందికి గురిచేస్తే గుణపాఠం తప్పదు.
అన్నం పెట్టే రైతన్నను పట్టించుకోవాలి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహించి పెద్దపీట వేయాల్సింది పోయి రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ తెలంగాణలో ధాన్యం సేకరణకు నిరాకరిస్తున్నది. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం కూడా బాగుపడిన దాఖలాలు లేవు. అన్నం పెట్టే రైతన్నను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం రేపు ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది.