కుల్కచర్ల , మార్చి 9 : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలో విచ్చలవిడిగా ట్రాక్టర్లలో మట్టి సరఫరా చేస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలో ఇళ్లకు ఎర్రమట్టిని ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ట్రాక్టర్లలో మట్టి రవాణా జోరుగా కొనసాగుతుంది.
కుల్కచర్ల గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన సుమారుగా 10 ట్రాక్టర్ల వరకు శనివారం, ఆది వారాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరపిలేకుండా మట్టిని పరిగి- మహబూబ్‌నగర్ రోడ్డుపై నుంచి తీసుకెళ్లడంతో వాహనదారులు, వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండో శనివారం, ఆదివారాలు ఆఫీసులకుసెలవులు ఉంటాయని భావించి పట్టపగలే మట్టిని తరలించే కార్యక్రమాన్ని కొంతమంది నిర్వహిస్తుంటే ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళితే పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మట్టిని పెద్ద మొత్తంలో తరలించాలంటే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రెవెన్యూ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉండగా ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో పాటు ట్రాక్టర్ల యజమానులు తమకు ట్రిప్పులకు డబ్బులు వస్తాయని భావించి సెలవుల రోజుల్లో మట్టించి తరలించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను రెవెన్యూ యంత్రాంగం గాని పట్టించుకోక పోవడంతోనే ఈ విధంగా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.