వికారాబాద్ , మార్చి 26: మున్సిపాలిటీల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా మున్సిపల్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాలి. అయితే దానికి భిన్నంగా వికారాబాద్ (Vikarabad) మున్సిపల్లో అనుమతులు లేకుండానే యధేచ్చగా నిర్మాణాలు సాగుతున్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారంలో (వికారాబాద్- గోదుమగూడ) రోడ్డులో అనుమతులు లేకుండా పెద్ద ఫంక్షన్ హాల్‌ను నిర్మించారు. గతంలో ఇక్కడ చిన్నపాటి రూము నిర్మాణం చేసి చిన్న చిన్న పార్టీలకు రెంట్‌కు ఇచ్చేవారు. ప్రస్తుతం రూమ్‌లను తొలగించి దాని ప్రదేశంలోనే 800 మంది కెపాసిటీతో పెద్ద ఫంక్షన్ హాల్, దాంతోపాటు పుట్టినరోజు పార్టీలు నిర్వహించేందుకు మరో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టారు. దీనికి అనుమతులు తీసుకుంటే పెద్ద మొత్తంలో మున్సిపల్ శాఖకు టాక్స్ వచ్చేది. ఫంక్షన్ హల్ నిర్మాణం చేపట్టి దాదాపుగా 6 నెలల గడుస్తున్నా, ప్రస్తుతం ఆ ఫంక్షన్ హల్ నిర్మాణం కూడా పూర్తయ్యింది.
మున్సిపల్ అధికారులకు ఇదంతా తెలియకుండా ఉంటుందా? తెలిసిన అధికార పార్టీ నాయకులకు మున్సిపల్ శాఖ అధికారులు భయపడుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇంత జరుగుతున్నా మున్సిపల్ శాఖ నుంచి ఒక నోటీసు కూడా ఇవ్వకుండా చూసీచూడనట్లు ఉండటాన్ని చూసి పట్టణ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతోనే వికారాబాద్‌లో అక్రమ నిర్మాణాలు సాగుతున్నట్లు తెలుస్తుంది. పేదవారు చిన్నపాటి నిర్మాణాలు చేస్తే హడావిడి చేసి కూల్చేసే మున్సిపల్ అధికారులు.. బడా నాయకులు నిర్మాణాలు చేస్తే మాత్రం కన్పించడం లేదా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా.. అనుమతులు లేవని, నోటీసులు జారీ చేస్తామన్నారు. నోటీసులకు సమాదానాలు రాక పోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సమాదానం చెప్పారు.