కొడంగల్, జూన్ 10: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక పరిపాలన కమిషనర్, డైరెక్టర్ టీకే. శ్రీదేవి తెలిపారు. మంగళవారం కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో 100 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, తడి, పొడి చెత్త విభజనపై ఇంటింటికి అవగాహన, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, మురుగు కాలువల్లో పూడికతీత పనులు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి సీడీఎంఏ డైరెక్టర్ టీకే శ్రీదేవి తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించలేకపోతున్నామని తెలిపారు. మహిళా స్వయం సంఘాల సభ్యులచే టెంట్ హౌస్ లను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ సంబంధించిన సామాగ్రి సరఫరా లేకుండా శుభకార్యాలను ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. దేశవ్యాప్తంగా పర్యావరణాన్ని కాపాడటానికి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వాడాల్సిన వస్తువులపై కూడా ప్రజలకు తెలియజేయాలని ఆమె తెలిపారు.
మురుగు కాలువల్లో
ఎప్పటికప్పుడు పూడిక తీసివేసి శుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. దోమల బెడద నివారించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక శిబిరాల నిర్వహించాలన్నారు. కొడంగల్‌ను సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దే దిశగా ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మంజూరైన పనులను ఇలాంటి జాప్యం లేకుండా పురోగతి దిశగా పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు. శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు నిర్లక్ష్య ధోరణితో ఉండకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పనులు వేగవంతం పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.