యాలాల, మే 8: యాలాల మండల పరిధిలోని గ్రామాలలో నీటి సమస్య (Drinking Water) ఉధృతమౌతుంది. నెల రోజుల క్రితం వరకు భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో వేసిన పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక, చేసేదేమిలేక పశువులను మేపిన సంగతి మరవకముందే తాగునీటి సమస్యతో బిందెలతో కుస్తి పడుతూ ట్యాంకర్ల వద్ద యుద్ధ సన్నివేశాలను నేడు చూసే స్థితి వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో గ్రామ గ్రామాణ మిషన్ భగీరథ నీటిని ప్రతి రోజు అందించేవారు. కానీ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ఇష్టారీతిన రోడ్డకు ఇరువైపులా అభివృద్ధి పేరుతో అధికారులు చేస్తున్న హడావిడి చర్యలతో మిషన్ భగీరథ పైప్‌లు ఎక్కడి కక్కడ పగిలిపోతున్నాయి. పగులగొట్టెటప్పుడు చూపుతున్న ఆతురత, ఆసక్తి వాటిని మరమ్మత్తులు చేయడంలో చూపకపోవడంతో గ్రామాలలో 4.5 రోజుల తరబడి మంచి నీరు అందడంలేదు. ప్రజలకు కావలసిన కనీస సౌకర్యలు తీర్చలేని ప్రభుత్వం ఎందుకంటూ గ్రామాలలో ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ఒక గల్లీకి కూడా సరిపోతలేవు: మహమ్మద్ ఆరీఫ్
15, 20 రోజుల కొకసారి మిషన్ భగీరధ నీళ్లు బందయిపోతున్నయ్. ఇలా బందయినప్పుడు నాలుగైదు రోజులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బోర్లు పనిచేయడం లేదు. దాంతో ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నాం. ట్యాంకర్ నీళ్లు ఒక వైపు అందిస్తే మరో వైపు నీళ్లు అందడం లేదు. ఒక గల్లీకి కూడా సరిపోతలేవు.
అనుడే తప్ప ఏమి చేయలే
నాలుగు రోజుల నుంచి నీళ్లు వస్తలేవని గొల్ల లక్ష్మమ్మ అనే మహిళ చెప్పారు. చానా తిప్పలౌతుంది. మొదలే ఎండాకాలం. ఎట్టనో ఏమో… ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. ఇట్ల తిప్పలు ఎప్పుడు పడలే. పైపులు పగిలినయి అంటుండ్రు. మంచిగ చేయించచ్చుగా.. ఎందుకు చేస్తలేరో తెలియడం లేదు. సార్లు వస్తరు. చేయిస్తమంటరు. పోతరు. అనుడే తప్ప ఏమి చేయలే.
బోర్లల్ల నీళ్లు లేవు
ట్యాంకర్ల నీళ్లే మాకు గతి, నాలుగు రోజుల నుంచి నీళ్లు రావడం లేదని మ్యాదరి బాలప్ప అన్నారు. గల్లీకి ఒక ట్యాంకర్ వస్లే సరిపోవడండం లేదు. హరిజన్వాడ, ఎస్సీ కాలనీ, తెలుగు గడ్డ ప్రాంతాలలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. ఎన్ని సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. బోర్లల్ల నీళ్లు లేవు. భూగర్బ జలాల అడుగంటినయి.