‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ రానున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించడతోపాటు అన్ని తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందుబాటులో తేనున్నారు. విద్యార్థులకు మరింత స్పష్టంగా అర్థమయ్యే రీతిలో బోధించేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. దీనికోసం అన్ని ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించగా.. ప్రత్యేక నిధులను కేటాయించనున్నది. తొలి విడుతలో రూ.300 కోట్లతో ఎంపిక చేసిన స్కూళ్లలో డిజిటల్ క్లాస్‌లను ప్రవేశపెట్టనున్నది. ఇప్పటికే వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 296 జడ్పీహెచ్ఎస్ల్లో డిజటల్ బోధన నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరిన్ని స్కూళ్లకు డిజిటల్ బోధనను విస్తరించనుండగా.. దశలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తేనున్నారు.
పరిగి, ఫిబ్రవరి 10: పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టినది. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతు లు కల్పించడంతోపాటు, విద్యార్థులకు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా బోధించేందుకు చర్య లు తీసుకుంటున్నది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమం అమల్లో భాగంగా ప్రభుత్వం 12 అంశాలపై ప్రత్యేక దృష్టిని సారించనున్నది. తరగతి గదుల మరమ్మతులతోపాటు కొత్తగా తరగతి గదుల నిర్మాణం, ప్రహరీలు, అవసరమైన చోట కిచెన్‌షెడ్ల నిర్మాణం, విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచీల ఏర్పాటు, దీం తోపాటు డిజిటల్ విద్యను అందించనున్నారు. ఇందుకుగాను తొలి విడుతలో ఎంపికయ్యే పాఠశాలల్లో డిజిటల్ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు ఖర్చు చేయనున్నది. వికారాబాద్ జిల్లాలో 1,058 పాఠశాలలున్నాయి. అందులో ప్రాథమిక పాఠశాలలు-764, ప్రాథమికోన్నత పాఠశాలలు-116, ఉన్నత పాఠశాలలు-174, టీఎస్ఎంఎస్లు-9, కేజీబీవీలు-18, టీఎస్ గురుకులాలు 26 ఉన్నాయి. వాటిలో సుమారు లక్షా10వేల మంది విద్యార్థులు చదువుతున్నా రు. ఈ ఏడాది జిల్లాలో అత్యధికంగా విద్యార్థు లు ఉన్న 35శాతం పాఠశాలలను మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసి మౌలిక వసతులను కల్పించనున్నారు.
సర్కారు బడుల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ విద్యను అందించేందుకు ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నది. జిల్లాలో 174 ఉన్నత పాఠశాలలు ఉండగా ఆ బడుల్లో విడుతల వారీగా డిజిటల్ విద్యను ప్రవేశపెట్టినా అందరికీ అందడం లేదు. దీంతో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వా రా ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయి నుంచే డిజిటల్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా పరిధిలోని 164 ఉన్నత పాఠశాలల్లో ప్రొజెక్టర్లు, 132 పాఠశాలల్లో కె-యాన్ల సహాయంతో డిజిటల్ విద్యాబోధన జరుగుతున్నది. విడుతల వారీగా జిల్లాలోని జడ్పీహెచ్ఎస్లలో బోధన కొనసాగింది. ఇప్పటికీ కొన్ని ఉన్నత పాఠశాలల్లో ఆ రెండింటిని ఉపయోగించి విద్యార్థులకు బోధిస్తున్నారు. కె-యాన్ అందజేసిన తర్వాత వాటి నిర్వహణ బాధ్యత చూసే సంస్థ బడులను సందర్శించి వాటి పనితీరును పరిశీలించింది. ఆయా తరగతుల విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రొజెక్టర్ల సహాయంతో టీచర్లు బోధిస్తున్నారు. సంబంధిత సబ్జెక్టులోని పాఠ్యాంశాలను సెల్ఫోన్లో క్యూఆర్‌కోడ్‌తో స్కాన్ చేసి సోదాహరణలతో, ప్రాక్టికల్‌గా చూపిస్తూ బోధించేందుకు డిజిటల్ బోధన ఉపకరిస్తుంది. కొన్ని సీడీలు లేదా పెన్‌డ్రైవ్‌లలో ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి సమాచారాన్ని ఉదాహరణలతో కూడిన దృశ్య రూపంలో చూపిస్తూ బోధించడం జరుగుతుంది. ప్రొజెక్టర్లను ఒక గదిలో ఉంచి విద్యార్థులను అక్కడికే తీసుకెళ్లి డిజిటల్ విద్య చెప్పడం జరుగుతుంది.
కె-యాన్ అనే పరికరాన్ని ఆయా తరగతి గదుల్లోకి తీసుకెళ్లి సంబంధిత సబ్జెక్టులను బోధించే సదుపాయం ఉంటుంది. కొన్నేండ్లపా టు ఈ విధానంలో బోధన జరుగగా కొవిడ్ సంక్షోభం నుంచి సాగడం లేదు. డిజిటల్ తరగతులు బోధించిన సమయంలో తమకు పాఠ్యాంశా లు చక్కగా అర్థమయ్యాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో డిజిటల్ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయించడం హర్షణీయమని వారు పేర్కొంటున్నారు. కేవలం బ్లాక్‌బోర్డుపై రాసి బోధించడం కంటే డిజిటల్ బోధనతో విద్యార్థులకు మరింత అవగాహన ఏర్పడుతుందని, పాఠ్యాంశాలు మరింత చక్కగా అర్థం చేసుకుంటారని చెప్పవచ్చు. ఏదైనా అంశానికి సంబంధించి కేవలం చెప్పడం కంటే, దాన్ని స్వయంగా చూపిస్తూ వాటికి సంబంధించిన ఉదాహరణలతో సహా వివరించడం ద్వారా విద్యార్థులకు ఎక్కువకాలం జ్ఞాప కం ఉండే అవకాశాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. డిజిటల్ బోధనలో సైన్స్, సోషల్ సబ్జెక్ట్‌లకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ.300 కోట్లు ఖర్చు చేసి డిజిటల్ తరగతులు బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడుతలో ఎంపిక య్యే 35శాతం బడుల్లో డిజిటల్ తరగతులను బోధించనున్నారు. ఇందుకు అవసరమైన అంచనాలు తయారు చేసి అన్ని పరికరాలను అధికారులు అందించనున్నారు.
డిజిటల్ తరగతుల నిర్వహణతో విద్యార్థుల్లో మరింత పరిజ్ఞానం పెరుగుతుంది. ప్రైవేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ విధానంలో బోధిస్తే గ్రామీణ ప్రాం త విద్యార్థులు చదువులో మరింత రాణిస్తారు. విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తాయి.
-సయ్యద్ మునీర్, కొడంగల్
డిజిటల్ బోధన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. బ్లాక్‌బోర్డుపై రాసి బోధించడం కంటే దాన్ని స్వయంగా చూపిస్తూ వాటికి సంబంధించిన ఉదాహరణలతో సహా వివరించడం ద్వారా విద్యార్థులకు ఎక్కువకాలం గుర్తు ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. -వినోద్‌కుమార్, చిన్ననందిగామ, కొడంగల్