బంట్వారం : బ్యాంక్ అధికారుల తీరుపై వినియోగదారులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం తొర్మామిడి గ్రామంలోని యూనియన్ బ్యాంక్ అధికారులు సమయపాలన పాటించకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు మహిపాల్ రెడ్డి, నర్సింలు తదితరులు మండిపడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో బ్యాంకుకు తాళం వేసి వినియోగదారులను బయటకు పంపి భోజనాలకు ఉపక్రమించారు. అసలే వర్షాకాలం కావడంతో బయట చినుకులు పడుతున్న వినియోగదారులు నిలబడేందుకు ఎలాంటి సౌకర్యాలు లేకున్నా వారిని బ్యాంకులోనికి రానివ్వకుండా తాళం వేశారు.
దీంతో బ్యాంకు లావాదేవీలు చేసుకోవడానికి వచ్చిన తాము గంటల తరబడి బయట వేచి ఉండాలా అని ప్రశ్నించారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు తాళం వేయడంతో వినియోగ దారులంతా రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది. బ్యాంక్ అధికారులు వినియోదారుల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. బ్యాంకులో కూర్చోవడానికి చోటు ఇవ్వకుండా బయటికి గెంటి వేయడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. దీనిపై బ్యాక్ పై స్థాయి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.