ప్రజాజీవితంలోకి అడుగుపెడుతూ.. ‘జన నాయగన్’ తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన నాటినుంచి తమిళనాట ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నిజానికి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ లభించని కారణంగా చివరి నిమిషంలో సినిమా ఆగిపోయింది.
ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామనుకుంటే.. రాజకీయ, వ్యక్తిగత విమర్శలు అధికంగా ఉన్నాయంటూ కొందరు ఈ సినిమాపై కోర్టును ఆశ్రయించారు. కోర్ట్ ఓ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. దాని రిపోర్ట్ రాకపోవడంతో ఈ నెలలోనూ విడుదల లేనట్లేనని తేలిపోయింది. ఏప్రిల్‌లో తమిళనాడు ఎన్నికలు జరుగనున్నాయి. ముందుముందు ఎలక్షన్ కోడ్ ఈ సినిమాకు సమస్యగా మారుతుంది.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా విడుదలను నిర్మాతలు జూన్‌కి వాయిదా వేసినట్లు వార్తలొస్తున్నాయి. జూన్ 22 విజయ్ పుట్టినరోజు కావడంతో జూన్ 18న సినిమాను విడుదల చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. మమితా బైజు కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి పూజా హెగ్డే కథానాయిక. బాబీడియోల్ ప్రతినాయకుడు. హెచ్.వినోద్ దర్శకుడు. వెంకట్ కె.నారాయణ నిర్మాత.