మర్పల్లి, మే 28 : చిన్న వర్షానికే వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్ల పై ఉన్న గుంతల్లో నీళ్లు నిలిచి మడుగులను తలపిస్తున్నాయి. మర్పల్లి మండల కేంద్రం నుంచి కోట్లపూర్, కల్కోడా నుంచి తొరమామిడి, వీర్లపల్లి నుంచి మోమిన్ పేట్ మండలంలోని ఎంకెపల్లి, మోరంగపల్లి వెళ్లే రోడ్లపై ఉన్న గుంతల్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచాయి.
ఎక్కడ గుంత ఉందో తెలియడం లేదని వాహనదారులు, పాదాచరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మర్పల్లి నుంచి ప్రతి నిత్యం వికారాబాద్ జిల్లా కేంద్రానికి వీర్లపల్లి ఎంకెపల్లి మీదుగా చాలా మంది రాకపోకలు కొనసాగిస్తారని, సంబంధిత అధికారులు రోడ్లపై ఉన్న గుంతలకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.