వికారాబాద్, జులై 31 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాలు నందు హౌసింగ్ అధికారులతో వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పనులు పురోగతిలో ఉండాలని సూచించారు. అర్హుడైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ప్రభుత్వ ఉద్దేశమని, జీవితంలో సొంత ఇల్లు ఉంటే సమాజంలో వారికి ఒక గుర్తింపు ఉంటుందని అన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 11,785 మంజూరు అయ్యాయని, 5,778 గ్రౌండింగ్ అయ్యాయని, 882 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారని తెలిపారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల కు సంబంధించి ఇండ్లు మంజూరు అయిన వారికీ బిల్లు తీసుకున్న లబ్ధిదారులకు రెండవ సారి అవకాశము లేదని పేర్కొన్నారు. స్లాబు లెవల్ వరకు జరుగుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు అయినంత వరకు బిల్లులు జమ అయ్యాయని, వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులలో వేగం పెంచాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఇందిరమ్మ నిర్మాణ పనులు త్వరగా జరిగేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు.