వికారాబాద్, జూన్ 19 : భూ సమస్యలను సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సులోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. గురువారం వికారాబాద్ మండలం అత్వెల్లి గ్రామం, వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని కొత్రేపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖి చేశారు. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
రెవెన్యూ సదస్సుల లో వచ్చిన దరఖాస్తుల వివరాలను దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా? మీ సేవలో దరఖాస్తు చేశారా? అని అడిగారు. వివరాల నమోదులో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో తప్పని సరిగా వివరాలు నమోదు చేయాలన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు.
రైతు సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే రైతులతో సామరస్యంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను పూర్తిగా విని దరఖాస్తులను స్వీకరించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, రెవెన్యూ డివిజినల్ అధికారి వాసు చంద్ర, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.