వికారాబాద్, మార్చి 6 : వికారాబాద్ పట్టణంలో దుర్వాసన, కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని డంపింగ్ యార్డ్‌ను, 28వ వార్డులను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యర్థాల నిర్వహణ విధానం, శుభ్రత, వ్యర్థాల వర్గీకరణ, పారిశుధ్య చర్యలపై అధికారులతో మాట్లాడారు. డంపింగ్ యార్డ్‌లో చెత్తను సక్రమంగా వర్గీకరించి శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పర్యావరణానికి హాని కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేసి రీసైక్లింగ్ చర్యలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో శుభ్రతను కచ్చితంగా పాటించాలని, దుర్వాసన, కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పట్టణంలో 28 వ వార్డ్ ను సందర్శించి వార్డ్ సమస్యల పై ఆరా తీశారు. ప్రతి ఇంటికి వెహికిల్ తిరిగి 100% తడి, పొడి చెత్త సేకరణ జరగాలని, వెహికిల్ లో జియో ట్యాగింగ్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. వారితో పాటు స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి, వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.