బొంరాస్ పేట, జూన్ 10 : దళిత నాయకుల అరెస్టుపై వికారాబాద్ జిల్లా దుద్యాల మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బస్సు చంద్రయ్య నిరసన తెలిపారు. తాండూర్ మండలం బెల్కటూర్ గ్రామంలో దళిత యువకుడి పెండ్లి ఊరేగింపు అడ్డుకుని కులం పేరుతో దూషించారని, వారిని అరెస్టు చేయాలని తాండూరు డీఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న దళిత సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తాండూరు డీఎస్సీ అగ్రకుల పెత్తందారుల కొమ్ముకాస్తున్నారని బస్సు చంద్రయ్య విమర్శించారు. డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే ఆయన్ను సస్పెండ్ చేసి, దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సొంత గ్రామంలో దళితులకు ఆలయ ప్రవేశం లేకపోవడం, దళితులు పెళ్లి చేసుకొని బారాత్ నిర్వహిస్తున్న సమయంలో అగ్ర కులస్తులు అడ్డుకోవడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. నిందితులను అరెస్టు చేసేవిధంగా జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు.