మొయినాబాద్, ఏప్రిల్ 15: వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. భక్తుల గోవింద నామస్మరణలు.. మంగళవాయిద్యాల మధ్య కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 11 గంటల నుంచి అర్ధ్దరాత్రి ఒంటి గంట వరకు శ్రీదేవీభూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి కల్యాణాన్ని అర్చకులు రంగాచార్యులు కనుల పండువగా నిర్వహించారు. ముందుగా శ్రీవారిని భక్తులు గోవింద నామ స్మరణల మధ్య ఆలయం చుట్టూ ఊరేగించారు. ఆలయానికి సమీపంలో ఉన్న మండపంలో స్వామివారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవార్లను కూడా ఊరేగింపుగా స్వామి వారి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకొచ్చి అద్దాలమహల్ ఎదుట ఏర్పాటు చేసిన పెళ్లిపందిరిలో కూర్చోబెట్టారు. స్వామివారి ఊరేగింపు ఎదుట చిన్నారుల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. శ్రీవారి కల్యాణాన్ని రం గాచార్యుల ఆధ్వర్యంలో 25మంది వేదపండితులు వైభవంగా నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. కల్యాణ వేడుక సు మారు మూడు గంటలపాటు కనులపండువగా జరిగింది. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు రంగరాజన్, కన్నయ్యస్వామి, మురళి, నరసింహ, బాలాజీస్వామి, సుదర్శన్, సురేశ్‌స్వామి ,సర్పంచ్ స్వరూప, ఉపసర్పంచ్ సుధాకర్‌రెడ్డి,నాయకులు గోపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, జయవంత్, చెన్నయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వేడుకైన శ్రీవారి కల్యాణానికి పట్టువస్ర్తాలను ప్రతి ఏడాది గున్నాల వంశీయులతోపాటు చిలుకూరు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగానే గురువారం రాత్రి జరిగిన స్వామివారి కల్యాణానికి పంచాయతీ పాలకవర్గం తరఫున గ్రామ సర్పంచ్ స్వరూప, ఉపసర్పంచ్ సుధాకర్‌రెడ్డి, పంచాయతీ సభ్యులు, గున్నాల వంశీయులతో కలిసి స్వామివారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్లు నర్సింహాగౌడ్, మల్లారెడ్డి, చెన్నయ్య, రాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం స్వామి వారి వసంతోత్సవం, గజవాహన సేవలను నిర్వహించారు. స్వామి వారిని పల్లకీలో ఊరేగించారు. కాగా శనివారం రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.