వికారాబాద్, సెప్టెంబర్ 22 : చేతనైతే రోడ్లు వేసి కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టుకోవాలి అని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ గోపాల్ ముదిరాజ్ అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వికారాబాద్ పట్టణంలోని పాడైన రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ నుంచే సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్నా రోడ్లు ఇంతా అధ్వానంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ నుంచి కొత్తగడి వైపు, వికారాబాద్ నుంచి హైదరాబాద్ ప్రధాన రహదారి కొత్రేపల్లి వద్ద రోడ్లు గుంతలు మారి వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
ప్రాణాలు సైతం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు వెంకటపూర్తండా వద్ద రోడ్డు పూర్తిగా పాడైపోయింది. నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటుకు వివిధ పనుల నిమిత్తం భారీ వాహనాలు ఈ రోడ్డు గుండనే వెళుతున్నాయి. 16టన్నులు మోయాల్సి రోడ్డుపై 40,50 టన్నుల భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్డు పూర్తిగా పాడైపోయింది. వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్లు బాగులేవని అక్కడి వారికి పిల్లను ఇచ్చే పరిస్థితి లేదని అసెంబ్లీలో స్పీకర్ చెప్పిన మాటను గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఇంత వరకు రోడ్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. చీటికి మాటిని కేసీఆర్, కేటీఆర్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసి పబ్బం గడుపుతున్నారే తప్పా ప్రజలకు చేసిందేమి లేదన్నారు. పాలన చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు దేవదాసు, సుభాన్‌రెడ్డి, బాబ్యనాయక్,శ్రీనివాస్ తండావాసులు ఉన్నారు.