పరిగి, మే 19 : ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం పరిగిలో కులకచర్ల మండలం పీరంపల్లికి చెందిన 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రావాలనే ఏకైక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరిట అలవికాని హామీలు ఇచ్చిందన్నారు.
అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు చేయకుండా, కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, కాంగ్రెస్ పట్ల ప్రజలలో వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడతామని ఆయన తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతి కుటుంబానికి మేలు చేకూరిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు పీరంపల్లి రాజు, నాయకులు పాల్గొన్నారు.